Srihari Goud Land Grab: శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత బాబాయికే ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని భూమిని కబ్జా చేసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాబాయ్ భార్య, ఆమె కొడుకు శ్రీహరి గౌడ్ ను నిలదీయగా.. వారిపై విచక్షణారహితంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తన భర్త పేరు మీదున్న భూమిని తన పేరు మీదకు బదిలీ చేయించుకునేందుకు బాధితురాలు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లింది. అయితే, ఆ ప్రక్రియలో ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త పేరుతో అప్పటికే ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించబడిందని, ఆ తర్వాత ఆ ఆస్తి శ్రీహరి గౌడ్ పేరు మీదకు బదిలీ చేయబడిందని ఆమె గుర్తించింది.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ తన భర్త పేరిట ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, భూమిని అతడి పేరు మీదకు బదిలీ చేయించుకున్నాడని ఆమె ఆరోపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శ్రీహరి గౌడ్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో న్యాయం కోసం శ్రీహరి గౌడ్ ఇంటి ముందు అతని బాబాయ్ భార్య, ఆమె కొడుకు నిరసనకు దిగారు. దీంతో శ్రీహరి గౌడ్ కోపంతో ఊగిపోయాడని.. బాబాయ్ భార్య, కొడుకు అని కూడా చూడకుండా తమపై విచక్షణారహితంగా దాడి చేశాడని ఆమె వాపోయారు. శ్రీహరి గౌడ్, అతని సోదరుడు సతీష్ గౌడ్ తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము పోలీసులను ఆశ్రయించి తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న శ్రీహరి గౌడ్.. తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు.












