నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం విషయంలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుటుంబానికి ఆర్థికంగా, వారి పిల్లల భవిష్యత్ కు అండగా ఉండటం ముందుకు వచ్చారు.
ఇందులో భాగంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. అంటే.. పిల్లలిద్దరికీ కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయలను అందించనున్నారు.
మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్న నేపథ్యంలో ఆమె భవిష్యత్ అవసరాలు, బాగోగుల కోసం ప్రత్యేకంగా మరో 25 లక్షల రూపాయలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున మొత్తం 2 కోట్ల 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది.
అదేవిధంగా ఆర్థిక సాయం అందించడంతోనే పార్టీ బాధ్యత ముగిసిపోదని స్పష్టం చేసిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్, వారి చదువులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన సమయంలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో పాటు వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తైన తర్వాత వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై.. ఆయన కుటుంబానికి భవిష్యత్‌లో అందించాల్సిన సంక్షేమం, సహాయంపై మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం ఒంటరిగా లేదని.. పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు ముందుకు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.












