కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు, అసంతృప్తులు, అంతర్గత గొడవలు తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. కాగా తాజాగా మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్‌హౌస్ కాంపౌండ్ వాల్‌ను గ్రామస్తులు కూల్చివేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ నిర్మించిన ప్రాంతంలో తమ పంట పొలాలకు వెళ్లేందుకు శతాబ్దాలుగా ప్రధాన రహదారి ఉండేదట. అయితే ఇటీవల ఆ దారిని మూసివేస్తూ గెస్ట్‌హౌస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు స్వయంగా షబ్బీర్ అలీకి విన్నవించినప్పటికీ.. తమ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇక చేసేది ఏం లేక శనివారం ఉదయమే పెద్ద సంఖ్యలో గెస్ట్‌హౌస్ వద్దకు చేరుకున్న స్థానికులు కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జప్తిశివునూర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు చెబుతున్నట్లుగా నిజంగానే పాత రహదారి మూసివేశారా? ఈ వివాదానికి అధికారుల ద్వారా ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రాజకీయంగా కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తులు, విభేదాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. అధికార పార్టీకి చెందిన కీలక నేతకు సంబంధించిన గెస్ట్‌హౌస్ వద్ద ఇలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..












