మెటా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
అసలేంటీ కథ..?
దేశంలో మెటా సేవలను అడ్డుకుంటారా..?
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల పరిస్థితేంటి..?
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటాకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత ఎందుకు పెరిగింది? ఫేస్‌బుక్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను కొద్దిసేపు పరిమితం చేయడం నుంచి మొదలైన వివాదం.. ఇప్పుడు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లోని కంటెంట్, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్, డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ భద్రత వంటి అనేక అంశాల వరకు వెళ్లింది. చివరకు మెటా ఉన్నతాధికారులు భారత ప్రభుత్వాన్ని కలసి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అసలు వివాదం ఏమిటి..?
జులైలో ప్రధాని మోదీకి సంబంధించిన ఓ ఫేస్‌బుక్ పోస్టును మెటా సిస్టమ్ కొద్దిసేపు ఆపేసింది. మెటా దీన్ని ఆపరేషనల్ ఎర్రర్‌గా వివరించింది. కానీ భారత ప్రభుత్వానికి ఇది చిన్న సాంకేతిక సమస్యగా కనిపించలేదు. దేశ ప్రధానమంత్రికి సంబంధించిన కంటెంట్‌నే ఒక అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థ తన సిస్టమ్ ద్వారా పరిమితం చేయడం ఎలా జరిగిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై మెటా ప్రతినిధులను ప్రభుత్వం వివరణ కోరింది. చివరకు మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కప్లాన్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు క్షమాపణలు చెప్పారు.
అయితే కథ ఇక్కడితో ఆగలేదు. మెటాపై కేంద్రం దృష్టి పడటానికి మరో ప్రధాన కారణం కంటెంట్ మోడరేషన్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్, డీప్‌ఫేక్‌లు కనిపించడం. వాటికి సంబంధించిన ప్రకటనలు ప్లాట్‌ఫామ్‌లలో కనిపించాయన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో మెటా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది కేంద్రం ప్రశ్నిస్తోంది.
వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ వివాదం
ఇదే సమయంలో వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ కూడా మరో వివాదానికి కారణమైంది. ఫోన్ నంబర్ ఇవ్వకుండా యూజర్‌నేమ్ ద్వారా ఇతరులను సంప్రదించే అవకాశం కల్పించే ఈ ఫీచర్‌ను భారత్‌లో తీసుకురావడానికి ముందు కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానం ద్వారా నకిలీ గుర్తింపులు, ఇంపర్సనేషన్, ఫిషింగ్, డిజిటల్ మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే మెటా ఈ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. భారత ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? దీనికి ప్రధాన కారణం భారత్ మెటాకు అత్యంత కీలకమైన మార్కెట్ కావడమే. కోట్లాది భారతీయులు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఏ కంటెంట్ ఉండాలి? ఏది తొలగించాలి? యూజర్ల భద్రత ఎలా ఉండాలి? ఫేక్ అకౌంట్లు, మోసాలు, డీప్‌ఫేక్‌లు, హానికరమైన కంటెంట్‌ను ఎలా నియంత్రించాలి? అనే అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యత కోరుతోంది.
మెటాకు సవాలే...
మెటా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు ఇది ఒక సవాల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన టెక్నాలజీ, కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి దేశం తనదైన నిబంధనలు తీసుకొస్తే వాటికి అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌ను మార్చడం పెద్ద సవాలే. అందుకే టెక్నాలజీ కంపెనీల స్వేచ్ఛకు, ప్రభుత్వ నియంత్రణకు మధ్య ఒక కొత్త పోరాటం మొదలవుతోంది.
ఈ పరిణామాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మెటా భారత్‌ను విస్మరించే పరిస్థితిలో లేదు. వివాదం పెరిగిన సమయంలోనే సంస్థ ఉన్నతాధికారులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అంతేకాదు, ప్రధాని మోదీ పోస్టును పరిమితం చేసిన ఘటనపై కూడా మెటా క్షమాపణలు చెప్పింది. అంటే భారత్ మార్కెట్ ప్రాధాన్యత ఎంత ఉందో కూడా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
అందుకే ఇది కేవలం మోదీ పోస్టు వివాదం కాదు. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఎవరి నియంత్రణ ఎంత ఉండాలి అనే పెద్ద ప్రశ్న. ఒకవైపు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ, భావ వ్యక్తీకరణ హక్కులు.. మరోవైపు సైబర్ మోసాలు, డీప్‌ఫేక్‌లు, పిల్లలకు సంబంధించిన హానికరమైన కంటెంట్, నకిలీ గుర్తింపులు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు ప్రభుత్వానికి, మెటాకు రెండింటికీ పెద్ద పరీక్షగా మారింది.
మొత్తానికి.. మెటాతో కేంద్రానికి జరుగుతున్న ఈ పోరాటాన్ని ఒక సంస్థపై చర్యల వ్యవహారంగా మాత్రమే చూడలేం. భవిష్యత్తులో భారత్‌లో సోషల్ మీడియా ఎలా పనిచేయాలి? టెక్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను ఎంతవరకు పాటించాలి? వినియోగదారుల భద్రతకు బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే కీలక దశగా దీన్ని చూడాల్సి ఉంటుంది.












