టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేసేందుకు సాయం చేయాలని కోరుతూ చేసిన ట్వీట్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అత్యంత సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ నుంచి స్థావరాన్ని మార్చుకుని సొంత మట్టిలో మొదటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పంత్ ఆకాంక్షను సీఎం మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ధామి, నిబంధనలకు లోబడి పంత్‌కు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న రిషబ్ పంత్, గత మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో సరైన స్థలం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ స్పష్టత లేకపోవడం వల్ల ప్రక్రియ జాప్యమవుతోందని, తన పహాడీ ప్రజల వద్దకు తిరిగి వచ్చి రాష్ట్రానికి సేవ చేయాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు ప్రభుత్వం ఇచ్చే పురస్కారంగా భావించినా సరే లేదా ప్రభుత్వ ధరల ప్రకారమైనా సరే స్థలాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
పంత్ పోస్టుపై స్పందిస్తూ సీఎం ధామి.. "ప్రియమైన రిషబ్, మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణం. మీ అద్భుతమైన ప్రదర్శనలు, సాధించిన విజయాలతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దేవభూమి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టారు. మాతృభూమిపై మీకున్న అమితమైన ప్రేమ, ఇక్కడికి తిరిగి వచ్చి సేవ చేయాలనే మీ భావన నిజంగా ఎంతో ప్రశంసనీయం" అంటూ కొనియాడారు.
https://x.com/pushkardhami/status/2085930126798471265?s=20
ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించిందని, వెంటనే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సీఎం ధామి స్పష్టం చేశారు. అధికారులు త్వరలోనే రిషబ్ పంత్‌ను నేరుగా సంప్రదించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. సీఎం నుంచి వచ్చిన ఈ తక్షణ స్పందనతో పంత్ సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే కల త్వరలోనే నెరవేరనుండటంతో అభిమానులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












