బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
నిబంధనలకు విరుద్ధంగా 2వేల భారీ వృక్షాలు నేలమట్టం
హెచ్‌సీటీ పేరుతో రాత్రికి రాత్రే హిటాచీలు, జేసీబీలతో మట్టి డంపింగ్
గతంలో కాపాడిన స్థలాన్ని కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రలు!
15 రోజులుగా మట్టి తోలుతున్నా మీనమేషాలు లెక్కిస్తున్న షేక్‌పేట్ రెవెన్యూ అధికారులు
భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిపై కార్పొరేట్ పంజా పడింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్( సాక్షిగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని సుమారు రూ.2,200కోట్ల విలువైన 11 ఎకరాల విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు అధికార పక్ష పెద్దల అండదండలతో ఒక భారీ స్కెచ్ వేశారు. కేబీఆర్ పార్కు ప్రాంగణంలో ఇటీవల చెట్లు నరికిన ఘటన మరవకముందే, దానికి సమీపంలోని ఈ పచ్చని అడవిపై యంత్రాలతో దాడి చేసి వేలాది వృక్షాలను నేలమట్టం చేస్తుండటం స్థానికులను, పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఎటుచూసినా ఎత్తైన కొండలు, దట్టమైన అడవిని తలపించే భారీ వృక్షాలతో కేబీఆర్ పార్కుకు పోటీగా నిలిచిన ఈ 11 ఎకరాల ప్రాంతం షేక్‌పేట్ మండలం సర్వే నంబర్-403 పరిధిలోకి వస్తుంది. గతంలో సుదీర్ఘమైన న్యాయపోరాటం అనంతరం, బీఆర్‌ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కరోనా లాక్‌డౌన్ సమయంలో చుట్టూ ఫెన్సింగ్ వేయించి ఈ విలువైన భూమిని కాపాడారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే, ప్రభుత్వ పెద్దల ప్రాపకం ఉన్న కార్పొరేట్ దిగ్గజం మెగా ఇంజినీరింగ్ సంస్థకు ఈ అత్యంత విలువైన స్థలాన్ని కట్టబెట్టేందుకు గుట్టుచప్పుడు కాకుండా రంగం సిద్ధం చేశారనే ఆరోపణాలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ సిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ (HCT) ప్రాజెక్టు పేరుతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిలింనగర్ పరిసరాల్లో చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ తవ్వకాల పనులను మెగా సంస్థ నిర్వహిస్తోంది. ఈ నిర్మాణ పనుల్లో వెలువడుతున్న వేలాది టన్నుల మట్టి, భారీ బండరాళ్లను తెచ్చి జలమండలి రిజర్వాయర్ పక్కనున్న ఈ రెవెన్యూ భూమిలో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. గత 15 రోజులుగా రాత్రికి రాత్రే వందలాది టిప్పర్లు, జేసీబీలు, భారీ హిటాచీ యంత్రాలను మోహరించి, లోయల వంటి ప్రాంతాల్లోకి మట్టిని తోస్తుండటంతో ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న పచ్చని చెట్లు మట్టి దిబ్బల కింద రూపులేకుండా కూరుకుపోతున్నాయి.
2వేల భారీ వృక్షాలు నేలమట్టం..
ఈ అక్రమ డంపింగ్ ధాటికి ఇప్పటికే సుమారు 2,000 వరకు భారీ వృక్షాలు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. కేవలం మట్టి తోలకం పేరుతో నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇంతటి విధ్వంసానికి ఒడిగడుతున్నా షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాజెక్టు అవసరాల కోసం తాత్కాలికంగా స్థలాన్ని వాడుకుంటున్నామని అధికారులు పైకి సాకులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కన్నులముందే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.
స్వాధీనం చేసుకున్న భూమిని అప్పగిస్తారా?
వాస్తవానికి జలమండలి రిజర్వాయర్ కుడివైపున ఉన్న 1.20 ఎకరాల జలమండలి స్థలంతో పాటు, 3.20 ఎకరాల రెవెన్యూ భూమిని యంత్రాలు, వాహనాలు పెట్టుకోవడానికి ఇప్పటికే మెగా సంస్థకు అధికారులు అధికారికంగా అప్పగించారు. అలాంటప్పుడు దానికి అదనంగా ఎడమవైపున ఉన్న ఈ 11 ఎకరాల దట్టమైన అటవీ భూమిని ఆక్రమించి మట్టిని తోలాల్సిన అవసరం ఏమొచ్చిందని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. గతంలో పార్థసారథి అనే వ్యక్తి ఆక్రమించుకున్న 5 ఎకరాల స్థలాన్ని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకోగా, ఆ స్థలాన్ని కూడా ఇప్పుడు మెగా సంస్థకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరో 11 ఎకరాల విశాలమైన భూభాగాన్ని కూడా ప్రస్తుతం జేసీబీలతో చదును చేస్తుండటం గమనార్హం.
బంజారాహిల్స్‌లో ఎకరా రూ.200కోట్లకుపైనే..
బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం భూమి విలువ కనీసం రూ.200కోట్లకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో, మొత్తంగా రూ.2వేల కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని చదును చేసి క్రమంగా ఆక్రమించుకునేందుకే ఈ నాటకానికి తెరతీశారనే చర్చ బలంగా నడుస్తోంది. అధికార బలం, కార్పొరేట్ వ్యవస్థల కొమ్ముకాసే ధోరణి కలగలసి నగరంలో మిగిలి ఉన్న కొద్దిపాటి పచ్చదనాన్ని కూడా బలితీసుకుంటుండటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
హెచ్‌సీటీ పేరుతో మౌలిక వసతుల కల్పన మంచిదే అయినా, ఆ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, వేలాది చెట్లను నరికి పర్యావరణానికి ముప్పు తెచ్చిపెట్టడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బంజారాహిల్స్ భూముల్లో జరుగుతున్న అక్రమ డంపింగ్‌ను నిలిపివేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












