తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్‌.. ఒకే ఆధార్‌తో ఇద్దరు ఉద్యోగులు.. రెండేసి జీతాలు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఆడిట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ కార్డు నంబర్‌ను వినియోగించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా లేదా రెండు వేర్వేరు పేర్లతో రెండు కీలక శాఖల్లో ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతాలను కొల్లగొడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది.

  • ఆర్థిక శాఖ తనిఖీల్లో బయటపడ్డ డూప్లికేట్ ఉద్యోగుల గుట్టు

  • 40 అనుమానాస్పద కేసుల్లో 80 మంది నకిలీ ఉద్యోగుల గుర్తింపు

  • పురుషుడిగా ఒక శాఖలో.. మహిళగా మరో శాఖలో నకిలీ వివరాలు

  • మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే లక్షల్లో జీతాల డ్రా: విచారణకు సీఎస్ ఆదేశం

 తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఆడిట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ కార్డు నంబర్‌ను వినియోగించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా లేదా రెండు వేర్వేరు పేర్లతో రెండు కీలక శాఖల్లో ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతాలను కొల్లగొడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఉద్యోగుల సమగ్ర డేటాను, ఆధార్ వివరాలను ఆర్థిక శాఖ లోతుగా పరిశీలించే క్రమంలో ఈ నకిలీ ఉద్యోగుల ఉదంతం బయటపడింది. ఇప్పటివరకు చేపట్టిన ప్రాథమిక విచారణలో 40 అనుమానాస్పద కేసులను గుర్తించగా, అందులో ఏకంగా 80 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ భారీ స్కామ్ ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, విద్యా శాఖల వరకు విస్తరించి ఉంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వీరంతా ఒప్పంద, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కాకపోవడం, అందరూ రెగ్యులర్ ఉద్యోగులు కావడం గమనార్హం. ఒకే ఆధార్ నంబర్‌పై ఒక శాఖలో పురుషుడిగా, మరొక శాఖలో మహిళగా నమోదైన కేసులు బయటపడగా.. మరికొన్ని చోట్ల ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి వేర్వేరు మతాల పేర్లతో రెండు శాఖల్లో ఉద్యోగాలు పొందిన అక్రమాలు వెలుగు చూశాయి.

వివిధ శాఖల్లో బయటపడిన ప్రధాన కేసులు పరిశీలిస్తే..

  • ప్రజారోగ్య శాఖ: ఒకే ఆధార్ నంబర్‌పై డి. ప్రమీల రాణి, కె. ప్రమీల పేర్లతో రెండు ఉద్యోగాలు నడుస్తున్నాయి.

  • విద్యా శాఖ: కిందింటి మోహన్ రెడ్డి, బసిరెడ్డి మోహన్ రెడ్డి పేర్లతో ఒకే ఆధార్‌పై ఇద్దరు ఉద్యోగులుగా జీతాలు పొందుతున్నారు.

  • రెవెన్యూ, డీజీపీ కార్యాలయం: రెవెన్యూ శాఖలో ఒకరు, డీజీపీ ఆఫీసులో మరో అన్నపూర్ణ పేరుతో ఒకే ఆధార్‌పై రెండేసి జీతాలు మంజూరవుతున్నాయి.

  • పంచాయతీరాజ్ శాఖ: సంతోష్ కుమార్ నీలకంఠ - బీర సతీష్ రెడ్డి పేర్లతో, అలాగే చిలుకూరి సుదర్శన్ - పలస ముత్యాలు పేర్లతో డూప్లికేట్ ఖాతాలు ఉన్నట్లు తేలింది.

  • కోఆపరేటివ్ విభాగం: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్‌లో డి.లావణ్య, రమాదేవి పేరిట ఒకే ఆధార్‌తో నిధులు మళ్లీస్తున్నారు.

కేవలం గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల కాలంలోనే ఒక్కో నకిలీ ఉద్యోగి ఖాతాలోకి దాదాపు రూ.5 లక్షల మేర ప్రభుత్వ ధనం జీతంగా జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ అక్రమాలకు సహకరించిన సంబంధిత శాఖల అధికారుల పాత్రపై కూడా నిఘా పెట్టాలని, పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

 

#TelanganaGovtScam#FakeEmployeesTelangana#AadhaarScam#TelanganaNews#HydNews#GovtEmployeesScam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి