వ్యాపారం

UPI ఫ్రీ పేమెంట్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా..? సామాన్యులకు కొత్త టెన్షన్..!

రచన: Kashi9 నిమిషాల పఠనం

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. వ్యక్తిగతంగా ఒకరు మరో వ్యక్తికి పంపే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే సంవత్సరానికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, లగ్జరీ హోటళ్లలో రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై 0.3 నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అవకాశం ఉందని సమాచారం.

UPIపై కొత్త నిబంధ‌న‌లేంటి..?

ఇక‌పై UPI ఫ్రీ కాదా..?

దేశంలో ఎందుకీ కొత్త చ‌ర్చ‌..?

UPIపై నిజా నిజాలు ఇవే...

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూపీఐ (UPI) మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. చేతిలో నగదు లేకపోయినా.. కేవలం మొబైల్‌తో క్షణాల్లో చెల్లింపులు చేసే సౌకర్యం కోట్లాది భారతీయుల జీవితాన్ని మార్చేసింది. ఇప్పటివరకు స్కాన్ చేయండి.. పేమెంట్ చేయండి అన్నంత సులభంగా, పూర్తిగా ఉచితంగా కొనసాగిన యూపీఐ లావాదేవీలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్ట సవరణలతో కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీలు విధించే అవకాశానికి తలుపులు తెరుచుకున్నాయి. ప్రభుత్వం మాత్రం సామాన్యులకు ఎలాంటి భారం ఉండదు అని చెబుతుంటే.. చివరికి ఈ భారం వినియోగదారులపైనే పడుతుందా? అనే సందేహాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు యూపీఐ, రూపే డెబిట్‌ కార్డు ద్వారా జరిగే చెల్లింపులపై ఎలాంటి మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) వసూలు చేయకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద షాపింగ్‌ మాల్‌ వరకు.. టీ దుకాణం నుంచి స్టార్‌ హోటల్‌ వరకు యూపీఐ చెల్లింపులు వేగంగా విస్తరించాయి. నగదు లేని ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని తీసుకెళ్లడంలో ఇదే కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు-2026 ఈ పరిస్థితిలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

అసలు MDR అంటే ఏమిటి..?

డిజిటల్‌ పేమెంట్‌ జరిగిన ప్రతిసారీ.. ఆ లావాదేవీ సురక్షితంగా పూర్తయ్యే వరకు బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వేలు, నెట్‌వర్క్‌ సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఈ సేవలకు అయ్యే ఖర్చునే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ అంటారు. ఇందులో ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు, పేమెంట్‌ ప్రాసెసింగ్‌ ఛార్జీలు, నెట్‌వర్క్‌ ఫీజు, జీఎస్టీ వంటి అంశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఖర్చులో కొంత భాగాన్ని బ్యాంకులు, ఫిన్‌టెక్‌ కంపెనీలు భరిస్తున్నాయి. అందుకే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు కనిపించడం లేదు.

ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం యూపీఐ, రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎలాంటి MDR విధించే అవకాశం లేదు. అయితే కొత్త సవరణతో ఏ రకమైన లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా నిర్ణయించే అధికారం పొందబోతోంది. అంటే రేపటి నుంచే ప్రతి యూపీఐ చెల్లింపుకూ ఛార్జీలు పడతాయన్నది కాదు. కానీ అవసరమైతే కొన్ని కేటగిరీల లావాదేవీలపై MDR అమలు చేసే చట్టబద్ధమైన అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది.

ఎవరికి ఛార్జీలు పడే అవకాశం ఉంది..?

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. వ్యక్తిగతంగా ఒకరు మరో వ్యక్తికి (Person to Person - P2P) పంపే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే చిన్న మొత్తాల లావాదేవీలు కూడా యథాతథంగానే కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది.

అయితే సంవత్సరానికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు, కార్పొరేట్‌ సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, లగ్జరీ హోటళ్లలో రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై 0.3 నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఛార్జీని వినియోగదారులు కాదు.. వ్యాపార సంస్థలే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం చెబుతున్నదేంటి..?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ఒక విషయం స్పష్టం చేశారు. MDR అనేది వినియోగదారులపై కాదు.. వ్యాపారులపై మాత్రమే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో దాదాపు 95 శాతం చిన్న మొత్తాలవే కాబట్టి సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ MDR ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు సాంకేతిక మౌలిక సదుపాయాల విస్తరణ, సైబర్‌ భద్రత, కొత్త ఆవిష్కరణల కోసం వినియోగిస్తాయని కూడా ప్రభుత్వం వివరిస్తోంది.

అసలు భయం ఎక్కడ‌..?

చట్టం ప్రకారం MDR వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఆ ఖర్చును తమ వస్తువుల ధరల్లో కలిపేస్తే.. చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడే అవకాశం ఉందన్నదే ప్రధాన ఆందోళన. ఇప్పటికే కొన్ని చోట్ల క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లిస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. అదే తరహాలో యూపీఐ విషయంలోనూ ప్రత్యక్షంగా కాకపోయినా.. వస్తువుల ధరలను పెంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు.. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పెద్ద వ్యాపార లావాదేవీలకే పరిమితమని చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో మరిన్ని కేటగిరీలకు విస్తరించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈ చట్ట సవరణపై వ్యాపార వర్గాలు, బ్యాంకింగ్‌ రంగం, ఫిన్‌టెక్‌ సంస్థలు, సాధారణ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సాధారణ యూపీఐ వినియోగదారులు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగత లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొత్త చట్టం ద్వారా భవిష్యత్తులో MDR అమలు చేసే అధికారం ప్రభుత్వానికి లభించనుంది. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే... ఈ ఛార్జీలు నిజంగానే వ్యాపారులకే పరిమితమవుతాయా..? లేక చివరకు వస్తువుల ధరల రూపంలో సామాన్యుల జేబుకూ చిల్లు పడుతుందా..? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు, అమలు విధానంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

#UPI#UPI Charges#UPI MDR#Merchant Discount Rate#UPI News#Digital Payments#NPCI#Google Pay#PhonePe#Paytm#RuPay#Banking News#India Finance#Digital Transactions#UPI Rules#UPI Update 2026#Finance News#India Economy#Online Payments#Payment Charges
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి