తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టులో మరో కీలక అడ్డంకి తొలగిపోయింది. ప్రాజెక్టు మొదటి దశ(ఫేజ్-1) అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (SEIAA) ముందస్తు పర్యావరణ అనుమతులు(EC) జారీ చేసింది. ఈ గ్రీన్‌సిగ్నల్‌తో దసరా పండుగ నాటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) కసరత్తును ముమ్మరం చేసింది.
మొత్తం రూ.7,055కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న మొదటి దశలో భాగంగా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21కిలోమీటర్ల మేర నదీ తీరాన్ని ‘వి’ఆకారంలో అభివృద్ధి చేయనున్నారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్ల వ్యవధిలోగా, అంటే 2028 నాటికి ఈ దశను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రాజెక్టులో భాగంగా నదికి ఇరువైపులా 30మీటర్ల వెడల్పుతో నూతన రహదారులు, సర్వీసు రోడ్లు, కాలినడక దారులు నిర్మించనున్నారు.
పరివాహక ప్రాంతంలో 495ఎకరాల భూమి, 639నిర్మాణాలు..
ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం మొత్తం 495ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందులో 158 ఎకరాల ప్రభుత్వ, 146 ఎకరాల పట్టా భూములతో పాటు 30 ఎకరాల రక్షణ శాఖ పరిధిలోని నివేదిత భూమి ఉంది. పరివాహక ప్రాంతంలోని 639 తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, ప్రాజెక్టు పరిధిలోని 2,660 చెట్లలో సాధ్యమైనంత వరకు వేరే ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటారని, తొలగించాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా 1:10 నిష్పత్తిలో కొత్త మొక్కలు నాటుతామని నివేదికలో వెల్లడించారు.
మురుగునీటి శుద్ధి కోసం అధునాతన ఎస్టీపీ (STP)లు, పంపింగ్ స్టేషన్లు నిర్మించి, పరిశ్రమల వ్యర్థాలు కలవకుండా అడ్డుకట్ట వేయనున్నారు. అంతేకాకుండా, పచ్చటి కారిడార్లు, పార్కులు, సాంస్కృతిక కేంద్రాల నిర్మాణంతో పాటు వర్షాకాలంలో 30 శాతం, మిగిలిన సమయాల్లో 20 శాతం మేర నదిలో సహజ ప్రవాహం ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కీలకమైన పర్యావరణ అనుమతి లభించడంతో భాగ్యనగర మూసీ నది త్వరలోనే అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్‌గా రూపుదిద్దుకోనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












