తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో త్వరలోనే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాలో నిధులు ఖాళీ అవడానికి ఈ ఉచితాలే ప్రధాన కారణమని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు సర్‌ఛార్జి బకాయిల చెల్లింపునకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణ సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘కోటీశ్వరులకు కూడా రైతుబంధు ఇవ్వడం, భారీ లగ్జరీ బైక్‌లపై తిరిగే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం వెనుక అర్థమేంటి?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాల సంస్కృతి వల్ల గ్రామాల్లో కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలు కష్టపడి పనిచేసే రోజులను రాబోయే రోజుల్లో వీడియోల్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని చురకలంటించింది.
అంతేకాకుండా, రాష్ట్ర మొత్తం జనాభా కంటే రేషన్ కార్డుల్లో ఉన్న సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే రూ.25.45కోట్లు విడుదల చేశామని, మిగిలిన బకాయిలను త్వరలోనే వాయిదాల వారీగా చెల్లిస్తామని ఆయన ధర్మాసనానికి వివరణ ఇచ్చారు.
అధికారి ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందిన కోర్టు, ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఇదే కేసు విచారణలో భాగంలో మరో కీలక ఆదేశాన్ని హైకోర్టు జారీ చేసింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న స్వీపర్లకు ప్రభుత్వం ముందే నిర్ణయించిన కనీస వేతనాలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను నాలుగు వారాల్లోగా అమలు చేయాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.












