టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇల్లు కట్టుకునేందుకు సరైన భూమి కొనుగోలు చేయడంలో సాయం చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అర్ధరాత్రి వేళ ఆయన విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున 12:46 గంటలకు పంత్ వరుసగా చేసిన ఈ ట్వీట్లలో విపరీతమైన స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు ఉండటంతో నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తన నివాసాన్ని ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలని భావిస్తున్నానని, అయితే స్థలాన్ని కొనుగోలు చేయడం ఒక పీడకలగా మారిందని పంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "హలో సార్, ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ వాసిగా ఇక్కడ స్థిరపడాలని చూస్తున్నాను. సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, కానీ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా భూమి దొరకడం లేదు. దయచేసి నాకు సాయం చేయండి" అని సీఎం పుష్కర్ సింగ్‌ను ట్యాగ్ చేస్తూ పంత్ రాసుకొచ్చారు.
https://x.com/RishabhPant17/status/2085807401991852338?s=20
ఆ వెంటనే చేసిన మరొక ట్వీట్‌లో.. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాఖండ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు ప్రభుత్వం భూమిని ఉచితంగా ఇస్తే సంతోషిస్తానని, లేదా ప్రభుత్వ ధరకు విక్రయించడానికి అనుమతించాలని కోరారు. అయితే భారత్-శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సమయంలో, అదీ అర్ధరాత్రి వేళ ఇన్ని తప్పులతో పంత్ పోస్ట్ చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పంత్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అసలు ఆయన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ఏమైనా హ్యాక్ అయిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/RishabhPant17/status/2085807401991852338?s=20
ఈ వింత ట్వీట్ల వ్యవహారంపై పంత్ లేదా ఆయన బృందం అధికారికంగా స్పందిస్తేనే అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ఐపీఎల్ వేలానికి ముందు రూ.15కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయిన పంత్, ఇటీవలే శ్రీలంకతో జరగనున్న సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపికయ్యారు. ఈ క్రమంలో భారత జట్టులోని కీలక ఆటగాడు ఆకస్మికంగా సోషల్ మీడియాలో ఇలాంటి విజ్ఞప్తులు చేయడం క్రీడా వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది.












