వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో తేమ పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ మార్పుల కారణంగా జీర్ణక్రియ కొంత మందగించడం, జలుబు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సీజనల్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో శరీరానికి శక్తినిచ్చే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యంఅని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన ఆహారంలో భాగమైన ఖర్జూరం, బాదం పప్పులు ఈ సీజన్‌లో మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉండటం వల్ల శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఐరన్ కూడా ఉండటం వల్ల ఐరన్ లోపం ఉన్నవారిలో రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరంలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఖర్జూరంలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారు లేదా బరువు నియంత్రించాలనుకునేవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు సరిపోతాయని అంటున్నారు..
ఇక బాదం పప్పుల విషయానికి వస్తే... ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్-ఈ, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. విటమిన్-ఈ శరీర కణాలను రక్షించడంలో, చర్మ ఆరోగ్యానికి తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది సమతుల్య ఆహారంలో మంచి స్నాక్‌గా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అయితే బాదం పప్పులను నేరుగా తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పొట్టు తీసి తినడం మంచిదని చాలా మంది పోషకాహార నిపుణులు సూచిస్తారు. దీనివల్ల నమలడం సులభమవుతుంది. మరోవైపు బాదం పప్పులలో కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకు సుమారు 20 నుంచి 30 గ్రాములు లేదా ఒక చిన్న గుప్పెడు బాదం తీసుకుంటే సరిపోతుందని తెలియచేస్తున్నారు.
వర్షాకాలంలో ఉదయం రెండు నుంచి మూడు నానబెట్టిన బాదం పప్పులు, సాయంత్రం ఒక ఖర్జూరం తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే మధుమేహం, కిడ్నీ వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం. సమతుల్య ఆహారం, తగినంత నీరు, పరిశుభ్రతతో పాటు ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా కాపాడుకోవచ్చని హెల్త్ ప్రొఫెషన్స్ పేర్కొంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












