రాష్ట్రంలో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రజా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు.
అలాగే థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులను దివ్యాంగుల కేటగిరీలో పరిగణించనున్నారు. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టింది. ముఖ్యంగా.. దరఖాస్తులకు ఎలాంటి చివరి తేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక పింఛన్లకు అర్హులుగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్నవారుగా నిర్ణయించారు.. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు.. మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులుగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు మొదలగు వీళ్ళ తల్లిదండ్రులు పింఛన్లకు అనర్హులుగా పేర్కొంది.
మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు.. నాలుగు చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలున్నవారినీ అనర్హులుగా తెలిపింది. ఇక పింఛన్ల కోసం గతంలో దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే తమ దరఖాస్తులు ఉన్నాయో.. లేదో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్తవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తే మాత్రం చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫారం నింపిన తర్వాత.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో అందించాలని.. పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లకు సమర్పించాలని అధికారులు పేర్కొంటున్నారు..












