Uday Krishna Reddy: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలోకి సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేరు తెరపైకి తెచ్చాడు ఉదయ్. సీపీ సజ్జనార్ పై ఉప్పరపల్లి కోర్టులో సంచలన ఆరోపణలు చేశాడు ఉదయ్. నిన్న ఎన్‌కౌంటర్ చేస్తానని సీపీ సజ్జనార్ తనను బెదిరించారని ఉదయ్ ఆరోపించాడు. ఈ మేరకు సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ ని ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు హాల్ లోనే ఉదయ్ ఏడ్చేశాడు. సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకెళ్లి తనను విచారించారని తెలిపాడు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టి విచారణ పేరుతో తనను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నిన్ను ఎన్ కౌంటర్ చేస్తానని సీపీ సజ్జనార్ బెదిరించారని ఉదయ్ ఆరోపించాడు.
ఉదయ్ చేసిన ఆరోపణలపై మేజిస్ట్రేట్ స్పందించారు. ఈ వ్యవహారంపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. ఈ మేరకు అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.












