Private Schools: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పాఠశాల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆ పేరు ఈ పేరు చెప్పి పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పేరెంట్స్ ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఫీజుల వసూళ్లలో పారదర్శకత తప్పని చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు.. క్లాసుల వారీగా ఫీజుల వివరాలను విద్యాశాఖ పోర్టల్ లో పొందుపరచాలంది. అలాగే ఫీజుల పట్టికను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని విద్యాశాఖ పేర్కొంది. నోటీస్ బోర్డులో ఫీజులు ప్రదర్శించని స్కూళ్ల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది విద్యాశాఖ.
ఏటేటా ఫీజులు పెంచుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ పై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా ఫీజు వివరాలను, అలాగే పాఠశాల పాలకమండలి సభ్యుల ఆమోదంతో నిర్ణయించిన ఆ ఫీజులకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాసుల వారీగా ఫీజు వివరాలను నోటీస్ బోర్డులో డిస్ ప్లే చేయడంతో పాటు https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా పాఠశాల విద్యా శాఖకు సమర్పించాలని అన్ని ప్రైవేట్ స్కూళ్లను ఆదేశించారు. తమ నోటీసు బోర్డులపై ఫీజు వివరాలను ప్రదర్శించడంలో లేదా శాఖకు ఆ వివరాలను సమర్పించడంలో విఫలమయ్యే పాఠశాలలకు 'షో-కాజ్' (కారణం వివరించాలని కోరే) నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్యా శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.












