Electric Flying Car: ఉత్తరాఖండ్ కు చెందిన యువ ఆవిష్కర్త రవి టమ్టా అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అదే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ (ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనం). అంటే గాల్లో ఎగిరే కారు. అరే.. కారు ఏంటి గాల్లో ఎగరడం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ రవి టమ్టా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించారు కూడా.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన ఆవిష్కర్త రవి టమ్టా.. తన స్టార్టప్ అయిన హపిడా స్కై నెక్స్ (Hapida Skynex) అభివృద్ధి చేసిన సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్‌ను ప్రయోగాత్మకంగా నడిపారు. హపిడా స్కైనెక్స్ అని పేరున్న ఈ యంత్రం డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫ్లయింగ్ వెహికల్ తొలి ప్రయోగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పర్వత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా..
పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యం ఎదురయ్యే సమస్య నుండే ఈ ఆలోచన పుట్టిందని టమ్టా చెబుతున్నారు. తన గ్రామం, ఇంటి మధ్య సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఈ ఎగిరే వాహనం ద్వారా అదే దూరాన్ని కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు.
అల్మోరాలోని ఒక బహిరంగ ప్రదేశంలో ఈ ప్రయోగం జరిగింది. ఇందులో టమ్టా, ఆయన బృందం ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఒక వ్యక్తిని మోసుకెళ్లగలిగే సామర్థ్యంతో ఈ ఫ్లయింగ్ వెహికల్ ను డ్రోన్ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఎన్నో ఏళ్లు చేసిన ప్రయోగాల ఫలితంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో సురక్షితమైన, ఎకో ఫ్రెండ్లీ ఎయిర్ మొబిలిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ముఖ్యంగా రోడ్డు ప్రయాణం నెమ్మదిగా, కష్టంగా ఉండే పర్వత ప్రాంతాలలో, ఈ ప్రాజెక్ట్ కొత్త రకమైన వ్యక్తిగత వాయు రవాణాకు దోహదపడుతుందని టమ్టా అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ను ఒకసారి చేసే ప్రయోగంగా పరిగణించకుండా, వ్యక్తిగత రవాణా కోసం ఉపయోగపడే సురక్షితమైన, విద్యుత్‌తో నడిచే ఎగిరే వాహనాన్ని అభివృద్ధి చేయడమే ఆయన దీర్ఘకాలిక లక్ష్యం.
హపిడా స్కైనెక్స్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ గా అభివర్ణించారు. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఎగిరే వ్యవధి, వేగం, పేలోడ్, ఛార్జింగ్ సమయం సహా వివరణాత్మక సాంకేతిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. ఈ తొలి ప్రయోగం టమ్టా, హపిడా స్కై సంస్థల ఏళ్ల రీసెర్చ్, డెవలప్ మెంట్ కు ముఖ్యమైన మైలురాయి. కానీ ఈ నమూనా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. వివిధ పరిస్థితుల్లో దీని స్థిరత్వం, విశ్వసనీయత, భద్రత, పనితీరును అంచనా వేయడానికి మరిన్ని పరీక్షలు అవసరం.
పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ ను సాధారణ ట్రాన్స్ పోర్ట్ కు ఉపయోగించే ముందు సుదీర్ఘమైన ప్రక్రియను క్లియర్ చేయాల్సి ఉంది. విమానయాన అనుమతులు, భద్రతా ధృవీకరణ, గగనతల నియమాలు, నిర్వహణ విధానాలు వంటి అంశాలను అధిగమించాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












