TG High Court: సమాజంలోని పలు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఆర్థిక భరోసా కల్పించేలా కొన్ని స్కీమ్స్ ను తీసుకొచ్చాయి. అయితే, పేదల కోసం తెచ్చిన ఉచిత పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని, సంపన్నులు సైతం లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఒక కేసు విచారణ సందర్భంగా.. ఉచిత పథకాల అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.
కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల కోసం తెచ్చిన రైతుబంధు పథకంతో సంపన్నులు కూడా లబ్ధి పొందుతున్నారని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతోందని కోర్టు తెలిపింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాలని అభిప్రాయపడింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక ఉచిత పథకాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. ఉచిత పథకాలతో భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం మిగులుస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చాం అనుకునే వాళ్లం.. కానీ, ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది అనే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేసింది.
ఉచిత పథకాలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. సంక్షేమ పథకాలు కచ్చితంగా ఉండాల్సినవే.. అయితే వాటి అమలులో పారదర్శకత, అర్హత ప్రమాణాలు అత్యంత కీలకం అని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే ప్రయోజనాలు దక్కాలంది. అందుకు అనుగుణంంగా విధానాలు ఉండేలా చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.












