ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్తాము.. కానీ అదే హాస్పిటల్ ప్రాణాలకు సంకటంగా మారితే.. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లో ఉన్న ఓ ప్రభుత్వ ఆస్పత్రి లో పైకప్పు స్లాబ్ ఊడి మీద పడి ఒక మహిళ గాయపడింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని చూరు జిల్లా సుజన్‌గఢ్‌లో ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రికి వైద్యం కోసం కిరణ్ మేఘ్వాల్ అనే 25 సంవత్సరాల మహిళ వెళ్ళింది. బుధవారం మధ్యాహ్నం ఆమె ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా వరండా పైకప్పు స్లాబ్ ఊడి ఆమె మీద పడింది. దీంతో ఆ మహిళ తలకు తీవ్ర గాయమవ్వగా అదే ఆస్పత్రిలో కుట్లు వేయాల్సి వచ్చింది.
మరోవైపు ఆస్పత్రిపై అధికారులకు ఉన్న నిర్లక్ష్యం ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఆస్పత్రికి మరమ్మతులు చేయాలని ఆగస్టు 4నే ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖకు లేఖ రాశామని, ఇప్పుడు మరోసారి లెటర్ రాస్తున్నామని ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ పురుషోత్తం కర్వా పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది..
జబ్బులు నయం చేయించుకోవడానికి ప్రజలు ఆస్పత్రులకు వెళ్తే, ఆసుపత్రులే ప్రాణాంతకంగా మారుతున్నాయని Xలో ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అందనంతగా పెరిగిపోయిందని, మౌలిక సదుపాయాలన్నీ కుప్పకూలుతున్నాయని విరుచుకుపడింది. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద గౌరవం లేదని కేవలం కమీషన్ల పైనే శ్రద్ధ చూపెడుతుందని దుయ్యబట్టింది.
మరోవైపు ఎక్కడ చూసినా శిథిలావస్థకు చేరిన భవనాలే కనిపిస్తున్నాయని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా ఆరోపించారు. ఎప్పుడు ఏ స్కూల్ పైకప్పు కూలుతుందో, ఏ ఆసుపత్రి స్లాబ్ రోగుల మీద పడుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొందని మండిపట్టారు..












