Investment Scam: ఈరోజుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. పెద్ద మనుషుల్లా, బడా బిజినెస్ మ్యాన్ లా, సంపన్నుల్లా బిల్డప్ ఇస్తారు. వారి రూపు రేఖలు, మాటలు చూసి గుడ్డిగా నమ్మేశామో.. ఇక అంతే సంగతులు.. అడ్డంగా మోసపోవడం ఖాయం. సర్వం దోచేస్తారు. తాజాగా ఆ తరహా ఘరానా మోసం ఒకటి బయటపడింది. అయితే, ఇక్కడ మోసపోయింది సామాన్యులు కాదు.. కోట్ల రూపాయల ఖరీదు చేసే అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉండే సంపన్నులు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైహోం భూజాలో భారీ మోసం వెలుగుచూసింది. కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ బయటపడింది. గణేశ్ లడ్డూ వేలంలో లడ్డూలు కొనుగోలు చేసి అపార్ట్ మెంట్ వాసుల్లో గుర్తింపు పొందిన వ్యక్తి భారీ మోసానికి తెరలేపాడు. తన మాయ మాటలతో అపార్ట్ మెంట్ వాసులను నమ్మించి నిండా ముంచేశాడు. భారీ లాభాల ఎరతో వారి నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు.
అతడి పేరు కొండపల్లి గణేశ్. గతంలో మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్నాడు. 2025లో మై హోమ్ భూజా అపార్ట్ మెంట్ లో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంలో రూ.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు గణేశ్. అంతే ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అతడు అపార్ట్ మెంట్ వాసుల దృష్టిని ఆకర్షించాడు. లడ్డూను ప్రసాదంగా పంచి పెట్టి వారితో పరిచయాలు పంచుకున్నాడు. తనను తాను బడా బిజినెస్ మ్యాన్ గా, వందల కోట్ల ఆస్తిపరుడిగా కలరింగ్ ఇచ్చి అక్కడ నివసించే వారిని నమ్మించగలిగాడు.
ఆ తర్వాత తన అనుచరుడు బోయినపల్లి కిరణ్‌తో కలిసి అదే కమ్యూనిటీలోని సంపన్నులను టార్గెట్ చేశాడు గణేశ్. తనకు రియల్ ఎస్టేట్, ఇతర భారీ వ్యాపారాలు ఉన్నాయని, తన దగ్గర పెట్టుబడి పెడితే ఏకంగా 6 శాతం రాబడి ఇస్తానని ఊరించాడు. 50 లక్షలకు లడ్డూ కొన్న వ్యక్తి కావడంతో కమ్యూనిటీ వాసులకు అతడిపై చిన్న డౌట్ కూడా రాలేదు. పైగా ఆఫర్ చాలా టెంప్టింగ్ ఉంది. ఇంకేముంది గుడ్డిగా అతడి దగ్గర లక్షలు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. కొన్ని రోజులకు లాభాల గురించి అడిగితే గణేశ్ కబుర్లు చెప్పాడు. రేపు, ఎల్లుండి అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఆపై ఫోన్లు ఎత్తడమూ మానేశాడు. అనుమానం వచ్చి ఆరా తీస్తే గణేశ్ అతడి అనుచరుడు కిరణ్ మై హోమ్ భూజాలోని తన అపార్ట్ మెంట్ ను, ఆఫీస్ ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసి కంగుతిన్నారు.
కొండపల్లి గణేష్ పై నమ్మకంతో సిల్వియా శ్రీనివాస్ రెడ్డి కుటుంబం రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టింది. మరికొందరు కూడా భారీగా మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా రూ.3.45 కోట్లు గణేష్ వసూలు చేసినట్లు తేలింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవితకాల పొదుపులకూ అతగాడు ఎసరు పెట్టాడు. గణేష్
మైహోం భూజా నుంచి బయటకు వెళ్లిపోయాక ఈ భారీ మోసం బయటపడింది. తాము మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గణేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఇదే తరహాలో మరికొందరినీ గణేశ్ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.












