అభివృద్ధి చెందుతున్న సిటీలలో హైదరాబాద్ నగరం ఒకటి. అందుకే ఇక్కడికి.. పలు రాష్ట్రాల నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చే వారి సంఖ్య నిత్యం పేరుతుందే కానీ తగ్గడం లేదు. ఈ క్రమంలో నగర రహదారులు నిత్యం రద్దీతో నిండిపోతున్నాయి..
ఒక్కో సారి ట్రాఫిక్ జామ్ అయితే.. గంటలతరబడి రోడ్లపైన వేచిచూడవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలా రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. ఈ బస్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జగద్గిరిగుట్ట సమీపంలో బస్ డిపో నిర్మాణం కోసం టీజీఎస్‌ఆర్టీసీ గతంలో హెచ్‌ఎంటీకి చెందిన స్థలాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు కోరగా.. కేవలం 20 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వగలమని, అదీ ఐదేళ్లకోసారి సమీక్షిస్తామని హెచ్‌ఎంటీ అధికారులు చెప్పినట్టు పేర్కొన్నారు.
అలాగే అదనంగా ప్రతి సంవత్సరం రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని షరతు విధించడంతో ఈ ప్రతిపాదనను టీజీఎస్‌ఆర్టీసీ తిరస్కరించిందని గడ్కరీ వివరించారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హెచ్‌ఎంటీ భూములకు సమీపంలోనే 100 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం టీజీఎస్‌ఆర్టీసీకి కేటాయించిందని గడ్కరీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం జగద్గిరిగుట్ట మీదుగా 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు రోజూ 404 ట్రిప్పులు నడుపుతున్నాయని, కొత్త డిపోతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ది చెందుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గాజులరామారం డిపోను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేకంగా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్, సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు..
మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నగరం నడిబొడ్డుకు రాకుండా ఇక్కడి నుంచే తమ సర్వీసులను నడుపుతాయి. తద్వారా ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్టాండ్లపై ఒత్తిడి తగ్గి, నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదని ప్రభుత్వం భావిస్తోంది.












