పార్టీ యాక్టివిస్ట్ పేరుతో లైన్‌లో పెట్టిన డాన్సర్
నెలనెలా రూ.లక్ష చొప్పున ట్రాన్స్‌ఫర్..
రెండిళ్లు కొనేసిన ప్రియురాలు
బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసి గుట్టురట్టు చేసిన సతీమణి
సీఎం సొంత జిల్లాలో జోరుగాసాగుతున్న పొలిటికల్ గాసిప్
రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితంలో మాత్రం చిన్నచిన్న పొరపాట్లతో పరువును బజారున పడేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే తెలంగాణ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒక కొత్త ఎమ్మెల్యే సారు, ఓ వయ్యారి వేసిన ప్రేమ వలలో చిక్కుకుని అడ్డంగా బుక్కయ్యారనే టాక్ నడుస్తోంది. చాలా రోజులుగా అత్యంత గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం, చివరకు ఆయన వేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బయటపడి రచ్చకెక్కినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. సదరు ఎమ్మెల్యే గారిని పార్టీలో చురుగ్గా పనిచేసే యాక్టివిస్ట్‌గా పరిచయమై, ఒక డాన్సర్ అయిన మహిళ ప్రేమ పేరుతో లైన్‌లో పెట్టింది. నాటి నుంచి ఇద్దరి మధ్య బంధం ముదిరి పాకాన పడింది. అయితే, ఈ గుట్టు ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తనకు నెలనెలా ఖర్చుల కోసం భారీగా డబ్బులు పంపాలని ఆ ప్రియురాలు సారుకు కఠిన షరతు విధించింది. ప్రియురాలి కోరికను కాదనలేకపోయిన మన ఎమ్మెల్యే, ఆమె అకౌంట్‌కు నెలకు క్రమం తప్పకుండా రూ.లక్ష చొప్పున ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడం ప్రారంభించినట్లు సమాచారం. ఇలా ఎమ్మెల్యే సాబ్ పంపిన సొమ్ముతో సదరు డాన్సర్ ఏకంగా రెండు ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ సీక్రెట్ లవ్ స్టోరీకి ఊహించని విధంగా ఎమ్మెల్యే సతీమణి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సదరు ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన ఆయన భార్య, ప్రతీ నెలా ఠంచన్‌గా రూ.లక్ష వేరొక అకౌంట్‌కు బదిలీ అవుతుండటాన్ని గమనించారు. ఆందోళనతో ఆ అకౌంట్ ఎవరిదని ఆరా తీయగా, ఎమ్మెల్యే కుటుంబానికి తెలియకుండా ప్రత్యేకంగా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనుమానం వచ్చి మరింత లోతుగా విచారించడంతో, సారు నడుపుతున్న ఈ రహస్య ప్రేమ వ్యవహారం, ఆన్ లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ కథ మొత్తం ఇంట్లో అడ్డంగా దొరికిపోయింది.
బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారానే తన రహస్య వ్యవహారం భార్యకు చిక్కిపోవడంతో ఆ కొత్త ఎమ్మెల్యే ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. పార్టీ యాక్టివిస్ట్ పేరుతో వలవేసి నెలనెలా లక్షలు గుంజిన ప్రియురాలి డిమాండ్లు, ఇంట్లో భార్య నిలదీతలతో ప్రస్తుతం ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో సందేహం లేదు. ఈ వ్యవహారం కాస్తా ఇంట్లోంచి బయటకు పొక్కి, ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది.
మరోవైపు, ఈ ఎమ్మెల్యే సాబ్ గతంలో వేల మందిని ముంచెత్తిన ఒక వివాదాస్పద ఇన్‌ఫ్రా కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలోనే ఆయన పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన కూడబెట్టారని, ఆ డబ్బుతోనే ఇప్పుడు ఈ లగ్జరీ వ్యవహారాలు నడుపుతున్నారనే వార్తలు నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. పదవి వచ్చిన కొత్తలోనే ఇలాంటి సంచలన వివాదంలో చిక్కుకోవడంతో, భవిష్యత్తులో ఈ వ్యవహారం ఆయన రాజకీయ జీవితాన్ని ఎటు వైపు తీసుకెళ్తుందోనని స్థానిక నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.












