రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి గిగ్ సర్వీసులు బంద్ కానున్నాయి. తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ 16 వాహన సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. రేవంత్ ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి తట్టిలేపడానికి తామంతా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది.ఆటో, క్యాబ్, లారీ, ఓలా, ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్ చేస్తామని జేఏసీ తెలిపింది.ఇప్పటివరకు చాలాసార్లు తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్‌ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్‌ఫేర్‌తో పాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసింది.తద్వారా యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, అన్ని గిగ్, ప్లాట్‌ఫారం కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలని కోరుతున్నారు.
తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి, వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు జేఏసీ డిమాండ్ చేసింది.మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025ను పూర్తిగా అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస చార్జీలను నోటిఫై చేయాలని..మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్‌ను మార్చకుండా ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని వాహన సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.












