సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన నిధుల విషయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉదయం హైకోర్టుకు హాజరయ్యారు. గతంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోనందున సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు నిన్న కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆయన నేడు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు.
కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన రూ.33 కోట్ల బకాయి నిధుల విడుదల వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన హాజరవ్వడం గమనార్హం. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయలేదని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
అధికారులను పదే పదే కోర్టుకు పిలిపించడం బాధాకరమని పేర్కొంది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటీషన్లు ఉన్నాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. వాటన్నింటినీలో శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు చేసే పొరపాట్లు, తప్పుల వల్ల బాధ్యతాయుతమైన అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
'రైతుబంధు' మంచి పథకమే అయినా.. సరైన వర్గీకరణ లేకపోవడం వల్ల కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం అర్హులకు మాత్రమే అందాలని, సమాజంలో ఎందరో అనర్హులు ఈ స్కీంతో ప్రయోజనాలు పొందుతున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు కంటోన్మెంట్ బోర్డు బకాయి నిధులను కొన్ని విడుదల చేశామని, మిగిలిన బకాయిలను విడతలవారీగా విడుదల చేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్శదర్శి కోర్టుకు వివరించినట్టు తెలిసింది.












