గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన స్థానికులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలోని విర్పర్ద గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో నీళ్లు కొన్ని రోజులుగా వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ, అలల మాదిరిగా కదులుతుండటం కలకలం రేపింది. అయితే, ప్రజలు భయాందోళన చెందుతున్నట్లుగా ఇది భూకంపానికి సంబంధించిన చర్య కాదని, భూగర్భంలో జరుగుతున్న సహజ సిద్ధమైన ప్రక్రియ వల్లే ఇలా జరుగుతోందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
విర్పర్ద గ్రామానికి చెందిన ప్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో సుమారు 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిని మూడు నెలల క్రితమే తవ్వించారు. అయితే ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ బావిలోని నీటిలో వింత కదలికలు ప్రారంభమయ్యాయి. నీళ్లు నిరంతరం అలల మాదిరిగా కదులుతూ, కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగిపొర్లుతున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నారు.
ఈ ఘటనపై మోర్బీ జిల్లా జియాలజిస్ట్ జే.ఎస్. వాధేర్ స్పందిస్తూ, ఇది భూకంప చర్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు వేగంగా పెరిగాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో భూగర్భ రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి, నీటి ఒత్తిడి కారణంగా బయటకు విడుదల కావడం వల్లే నీటిలో ఈ విధమైన అలజడి ఏర్పడుతోందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడ ఎటువంటి భూపాత రేఖ (ఫాల్ట్ లైన్) లేదని, ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదని గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ కూడా ధ్రువీకరించింది.
మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఈ విషయంపై స్పందిస్తూ.. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని వెల్లడించారు. దీనిపై సమగ్ర పరిశోధన జరిపేందుకు గాంధీనగర్ నుంచి ఒక ప్రత్యేక నిపుణుల బృందం త్వరలోనే విర్పర్ద గ్రామానికి రానుందని ఆయన పేర్కొన్నారు. ఆ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన జరిపిన తర్వాతే ఈ నీటి అలజడికి గల కచ్చితమైన శాస్త్రీయ కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.












