తలకి ఒక ప్రత్యేకమైన హెల్మెట్ ధరించి కొన్ని గంటల పాటు కూర్చుంటే చాలు.. వేల రూపాయల నజరానా చెల్లిస్తోంది ఓ ప్రముఖ ఏఐ సంస్థ. మానవ ఆలోచనలను నేరుగా టెక్స్ట్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్న శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'కండ్యూట్' (Conduit) అనే ఏఐ స్టార్టప్ ఈ వినూత్న అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వలంటీర్లకు రెండు గంటల సెషన్‌కు ఏకంగా 55 డాలర్లు (దాదాపు రూ. 5,237) ఆఫర్ చేస్తోంది.
ఈ వినూత్న పరిశోధనలో భాగంగా వలంటీర్లు ఎలక్ట్రోడ్‌లు అమర్చిన ఒక ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. రెండు గంటల పాటు సాగే ఈ సెషన్‌లో పాల్గొనేవారు ఏఐ సిస్టమ్‌లతో మాట్లాడుతూ లేదా కీబోర్డ్ వైపు చూడకుండా వేగంగా టైప్ చేస్తూ ఉండాలి. ఆ సమయంలో వారి మెదడు నుంచి వెలువడే నాడీ సంబంధిత విద్యుత్ సంకేతాలను హెల్మెట్ లోని ఎలక్ట్రోడ్లు రికార్డ్ చేస్తాయి. అయితే ఈ పరిశోధనలో పాల్గొనాలంటే వేళ్ల వైపు చూడకుండా టైపింగ్ చేయగల నైపుణ్యం తప్పనిసరి అని సంస్థ స్పష్టం చేసింది.
ఎలాంటి శస్త్రచికిత్సల అవసరం లేకుండా (నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో) కేవలం నాడీ సంకేతాల ఆధారంగా ఆలోచనలను చదివే ఈ సాంకేతికతను 'టెలిపతీ ఎట్ స్కేల్' అని కంపెనీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. కృత్రిమ మేధ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇలాంటి ప్రయోగాల్లో ఉన్న వేళ, ఓపెన్ఏఐ మాజీ ప్రముఖ పరిశోధకురాలు నయోమి బష్కాన్స్కీ ఈ స్టార్టప్‌లో వ్యవస్థాపక పరిశోధకురాలిగా చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం కండ్యూట్ సంస్థ తమ పరిశోధనా కేంద్రంలో వలంటీర్లకు భారీగా నగదు చెల్లిస్తూ, అతిపెద్ద 'న్యూరో-లాంగ్వేజ్ డేటాసెట్'ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మెదడు నుంచి వచ్చే సంకేతాలను, అధునాతన లాంగ్వేజ్ మోడళ్లతో అనుసంధానించి మానవ ఆలోచనల నమూనాలను (ప్యాటర్న్‌లను) సరిగ్గా గుర్తించడం ద్వారా ఈ టెక్నాలజీ భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.












