పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న అన్నాచెల్లెళ్లపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధిలోని ‘లర్‌గావ్-మర్కటోలా’ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గోర్సే జూరి (50), సోదరుడు హలాల్ జూరి (45) పొలం పనులు ముగించుకుని తమ పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది.
దీంతో అప్రమత్తమైన వారిద్దరూ పిల్లలను సురక్షిత ప్రాంతాల్లో వదిలేశారు. అనంతరం గోర్సే, హలాల్ ఇద్దరు కలిసి ఆ ఎలుగుబంటితో తలపడ్డారు.వారి మీద ఎలుగు తీవ్రంగా దాడి చేయగా.. అక్కడే మృతి చెందారు.అంతకుముందు వారి కేకలు విని సమీపంలోని పొలంలో పని చేస్తున్న మరో సోదరి ఖోరిన్ బాయి(43) వారిని రక్షించేందుకు వచ్చింది.
https://x.com/pulsenewsbreak/status/2085543448296448351?s=20
అప్పటికే ఎలుగుబంటి దాడిలో గోర్సే, హలాల్ మృతి చెందగా.. ఖోరిన్‌కు తీవ్ర గాయాలవ్వడంతో మరికొందరు స్థానికులు చూసి వెంటనే ఎలుగును అక్కడి నుంచి తరమేసి గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, తన పిల్ల ఇన్ఫెక్షన్‌తో చనిపోయిందన్న ఆక్రోశంలోనే ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేసిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలుగుబంటిని బంధించాలని ఫారెస్టు అధికారులను సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.












