ఏపీ

విజయసాయిరెడ్డి ప్లాన్ ఏంటి..? చివరికి అన్ని దారులు వైసీపీకేనా..?

రచన: Kashi8 నిమిషాల పఠనం

బీజేపీ కాకపోతే మరో ఆప్షన్‌గా కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చని విజయసాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం అంటే కేవలం పేరు ప్రకటించడం కాదు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన కేడర్ ఉండాలి. భారీ ఆర్థిక వనరులు కావాలి. ప్రజల్లో వ్యక్తిగత చరిష్మ ఉండాలి. విజయసాయిరెడ్డి రాజకీయ వ్యూహాల్లో దిట్టే అయినా.. స్వతంత్రంగా ప్రజా నాయకుడిగా ఎదిగిన చరిత్ర మాత్రం లేదు.

విజ‌య‌సాయి ఎంట్రీ ఏ పార్టీలోకి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో తెగ చ‌ర్చ‌

మ‌ళ్లీ వైసీపీ వైపే అడుగులు వేస్తున్నారా..?

ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్-2గా వ్యవహరించిన నాయకుడు. ఢిల్లీలో పార్టీకి పిల్ల‌ర్‌గా నిలిచిన వ్యక్తి. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నేత. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రతి వారం కొత్త సంకేతాలు ఇస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఒకసారి కొత్త పార్టీ అంటున్నారు.. మరోసారి బీజేపీ వైపు చూస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.. ఇంకోసారి మీడియా రంగంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనలన్నీ ఎంతగా వినిపించినా.. వాటి వెనుక రాజకీయ లాజిక్ మాత్రం అంతగా కనిపించడం లేదనే చర్చ సాగుతోంది.

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఒక్కసారిగా పార్టీకి దూరమయ్యారు. జగన్ చుట్టూ కోటరీ ఏర్పడిందని ఆరోపిస్తూ బయటకు వచ్చారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. దీంతో విజయసాయిరెడ్డి రాజకీయ అధ్యాయం ముగిసిపోయిందని చాలామంది భావించారు. కానీ కొద్దిరోజులు కూడా గడవక ముందే ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. మీడియా ఇంటర్వ్యూలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, వరుస ప్రకటనలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన అసలు లక్ష్యం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది.

మొదట ఆయన పేరు ఎక్కువగా వినిపించింది భారతీయ జనతా పార్టీతోనే. బీజేపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. ఒకవేళ అదే జరిగితే టీడీపీ-జనసేన కూటమిలో కూడా తనకు ప్రాధాన్యం లభిస్తుందని ఆయన భావించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ వాస్తవ రాజకీయ సమీకరణాలు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ తన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనతో సమన్వయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అలాంటి సమయంలో విజయసాయిరెడ్డి వంటి నాయకుడిని చేర్చుకోవడం వల్ల లాభాల కంటే రాజకీయ ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని భావించినట్టు చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన ఆహ్వానం కనిపించలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొత్త పార్టీ పెడ‌తారా..?

బీజేపీ కాకపోతే మరో ఆప్షన్‌గా కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చని విజయసాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు. కానీ అక్కడ కూడా పెద్ద ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం అంటే కేవలం పేరు ప్రకటించడం కాదు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన కేడర్ ఉండాలి. భారీ ఆర్థిక వనరులు కావాలి. ప్రజల్లో వ్యక్తిగత చరిష్మ ఉండాలి. ఎన్నికల్లో గెలిపించే స్థాయి ఓటు బ్యాంకు ఉండాలి. విజయసాయిరెడ్డి రాజకీయ వ్యూహాల్లో దిట్టే అయినా.. స్వతంత్రంగా ప్రజా నాయకుడిగా ఎదిగిన చరిత్ర మాత్రం లేదు. ఆయన బలం ఎప్పుడూ జగన్ నాయకత్వంతోనే ముడిపడి ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది.

ఇక ఇటీవల ఆయన ప్రస్తావిస్తున్న మరో అంశం మీడియా రంగం. డిజిటల్ మీడియా, శాటిలైట్ ఛానల్, కొత్త కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం మీడియా రంగం కూడా అంత సులభమైనది కాదు. వందల కోట్ల పెట్టుబడులు, నిరంతర కంటెంట్, సాంకేతిక బలం, విశ్వసనీయత, ప్రకటనల మార్కెట్... ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మీడియా సంస్థ నిలబడగలదు. కేవలం రాజకీయ గుర్తింపుతో మీడియా సామ్రాజ్యం నిర్మించడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ మొత్తం కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒక్కటే. విజయసాయిరెడ్డికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తే... చివరికి మిగిలేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నిర్మాణం ఆయనకు పూర్తిగా తెలుసు. అక్కడి నాయకత్వంతో కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. పార్టీ బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావాలంటే ఆయనకు అత్యంత సహజమైన వేదిక కూడా అదే కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదంతా జరగాలంటే ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఆ స‌మాధాన‌మే.. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ విజయసాయిరెడ్డిని అంగీకరిస్తారా? విజయసాయిరెడ్డి కూడా గత విభేదాలను పక్కన పెట్టి తిరిగి వైసీపీ గూటికి చేరుతారా? ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలకూ స్పష్టమైన సమాధానం లేదు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని గత చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది.

అందుకే విజయసాయిరెడ్డి వరుస ప్రకటనలు ఎంత హాట్ టాపిక్‌గా మారుతున్నా... చివరికి ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ప్రకటనలు కాదు... రాజకీయ సమీకరణాలే. మరి విజయసాయిరెడ్డి నిజంగా కొత్త దారి ఎంచుకుంటారా..? లేక అన్ని దారులు చివరికి వైసీపీకే చేరుతాయా..? ఈ ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లోనే స‌మాధానం దొర‌క‌వ‌చ్చు.

#Vijayasai Reddy#YSRCP#YS Jagan Mohan Reddy#Andhra Pradesh Politics#AP Politics#BJP Andhra Pradesh#Telugu Politics#Political Analysis#Andhra News#YSR Congress Party#AP Political News#Indian Politics#Vijayasai Reddy News#AP Political Updates#Political Strategy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి