National

India: డీపీడీపీ చట్టం ఎఫెక్ట్... వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌!..

రచన: Venu4 నిమిషాల పఠనం

డీపీడీపీ చట్టంలోని నిబంధనల ప్రకారం చిన్నారుల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్‌ వేదికలు వినియోగదారుల వయసును నిర్ధారించే విధానం అమలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించే వ్యవస్థ ఉండాలని చట్టం చెబుతోంది.

భారత్‌లో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొందరు వినియోగదారులకు తమ పుట్టిన తేదీని నమోదు చేయాలని సూచిస్తూ నోటిఫికేషన్‌ పంపిస్తోంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఉన్న యూజర్లతో మాత్రమే పరీక్షిస్తున్నట్లు వాట్సాప్‌ అధికారికంగా ధ్రువీకరించింది.

ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారాయి. దీంతో పుట్టిన తేదీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలా? అనే సందేహాలు వినియోగదారుల్లో వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై వాట్సాప్‌ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం పుట్టిన తేదీ నమోదు పూర్తిగా ఐచ్ఛికమే అని తెలిపింది. వివరాలు ఇవ్వకపోయినా యాప్‌ను ఇప్పటిలాగే ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చని పేర్కొంది.

అంతేకాదు, ఈ ఫీచర్‌ వల్ల యాప్‌ వినియోగంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా స్పష్టం చేసింది. వినియోగదారుల వయసుకు సంబంధించిన సమాచారం అత్యంత వ్యక్తిగతమైనదని, ఆ వివరాలను ఇతరులకు కనిపించేలా చేయబోమని వెల్లడించింది. గోప్యతకు భంగం కలగకుండా వినియోగదారుల వయసును నిర్ధారించే సురక్షిత విధానాలపై ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది.

డీపీడీపీ చట్టంలోని నిబంధనల ప్రకారం చిన్నారుల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్‌ వేదికలు వినియోగదారుల వయసును నిర్ధారించే విధానం అమలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించే వ్యవస్థ ఉండాలని చట్టం చెబుతోంది. అదే దిశగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు భారత్‌లో మెటా సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఇటీవల పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తాత్కాలికంగా తొలగించబడిన ఘటనపై మెటా ఇప్పటికే క్షమాపణలు తెలిపింది. అలాగే, మొబైల్‌ నంబర్‌ అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో ఇతరులతో కనెక్ట్‌ అయ్యే ఫీచర్‌ను విడుదల చేయడంపై కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

నకిలీ ఖాతాలు, సైబర్‌ మోసాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి డీపీడీపీ చట్టానికి అనుగుణంగా వినియోగదారుల వయసు నిర్ధారణ, చిన్నారుల డేటా రక్షణ, గోప్యతకు భంగం కలగకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంపై వాట్సాప్‌ దృష్టి సారించినట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

#India#WhatsApp#Digital Personal#Data Protection#DPDP Act#New feature
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి