దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. పరీక్షకు మూడు రోజుల ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, వాటిని వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్‌లైన్ కోచింగ్ క్లాసుల ద్వారా విద్యార్థులకు చేరవేశారని పేర్కొంది.
ఈ వ్యవహారంలో ఎన్‌టీఏకు అనుబంధంగా ఉన్న సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులతో పాటు మరికొందరు వ్యక్తులు కూడా కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ ఆరోపించింది. అలాగే నీట్ కెమిస్ట్రీ ప్రశ్నాల తయారీలో పాల్గొన్న ప్రొఫెసర్ పీవీ కులకర్ణి ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య పూణేలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ క్లాసులకు హాజరైన విద్యార్థులకు క్వశ్చన్స్ లీక్ చేసినట్టుపేర్కొంది.
అంతేకాకుండా.. కులకర్ణి మొబైల్ ఫోన్ నుంచి కెమిస్ట్రీ ప్రశ్నల ఫోటోలు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో అతడు జరిపిన సంభాషణలు, ఇతర కీలకమైన డిజిటల్ ఆధారాలు లభించాయని, విద్యార్థుల నోట్‌బుక్‌లలో రాసుకున్న ప్రశ్నలు.. లీకైన ప్రశ్నపత్రంతో సరిపోతున్నాయని తెలిపింది. ఇక కెమిస్ట్రీ పేపర్ లీక్ చేసిన కులకర్ణి ఫిజిక్స్ పేపర్ కోసం కూడా ప్రయత్నించినట్టు తెలిపింది.
మరోవైపు ఫిజిక్స్ ప్రొఫెసర్ మనీషా వాఘ్మారేకు సైతం పేపర్ లీక్‌లో హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. పరీక్షకు ఎనిమిది రోజుల ముందే ఆమె మొబైల్ ఫోన్‌లో చేతితో రాసిన ప్రశ్నపత్రాలు గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రశ్నపత్రాలను మరో నిందితుడైన తేజస్ షాకు అందించగా.. అతడు వాట్సప్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేశాడని సీబీఐ తెలిపింది.
ఇక ఈ పేపర్ లీక్ కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.4 లక్షల వరకు వసూల్ చేశారని ఆరోపించింది. బోటనీ నిపుణురాలు మనీషా గురునాథ్ మాంధరే తన ఇంట్లో తరగతులు నిర్వహించి.. విద్యార్థులకు ప్రశ్నాలు లీక్ చేశారని పేర్కొంది. ఇక ఆ ప్రశ్నలే నీట్ పేపర్లో వచ్చినట్లు గుర్తించామని సీబీఐ తెలిపింది. నిందితులు ఎన్‌టీఏ కార్యాలయంలోని భద్రతా తనిఖీల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని ప్రశ్నపత్రాలను బయటకు తీసుకెళ్లినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
రాజస్థాన్‌లోని సికార్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కోచింగ్ నెట్‌వర్క్ ద్వారా లీకైన ప్రశ్నపత్రాలను పెద్ద సంఖ్యలో విద్యార్థులకు చేరవేసినట్లు వెల్లడించింది. పరీక్షకు ముందు, మే 2వ తేదీ రాత్రి సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రంతో కూడిన పీడీఎఫ్ ఫైల్‌ను పంపిణీ చేసినట్లు సీబీఐ ఆరోపించింది.
దేశ భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడం లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి తేవడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత, భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..












