హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్దేశిత సమయాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలో జోన్ల వారీగా ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ముఖ్యంగా చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు (48 గంటలు) మద్యం దుకాణాలతో పాటు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు పూర్తిగా మూతపడనున్నాయి. అలాగే రాజేంద్రనగర్, గోల్కొండ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు (24 గంటలు) వైన్ షాపులు బంద్ ఉంటాయి. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మరోవైపు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు.
పండుగ వేళ వేలాది మంది భక్తులు, ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించి, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.












