ప్రభుత్వ ఉద్యోగం అంటే బాధ్యతతో కూడుకున్న ఒక యుద్ధం. అందుకే ఈ ఉద్యోగం కోసం కొందరు అహర్నిశలు కష్టపడతారు. ఎంతో శ్రమకు ఓర్చుకుంటారు.. తీరా బాధ్యతాయుతమైన అవకాశం చిక్కగానే.. వారి బుద్ధి మందగించి.. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం, పరువు గంగలో కలిపేసుకుంటున్నారు.. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది.
ఇక ఈ ఉదంతానికి ఉదాహరణ.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పుకోవచ్చు.. పది మందికి మార్గదర్శకుడిగా మారిన ఈయన.. అహంకారంతోనో లేదా మరే కారణం చేతనో గాని ఇప్పుడు సమాజంలో నిందితునిగా నిలబడ్డాడు.
ఈ ట్రైనీ ఐపీఎస్ లీలలు విస్తుగోలిపేలా రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఉదయ్ ఇది వరకు రాసిన సూసైడ్ నోట్ గురించి సీపీ సజ్జనార్ అతడిని విచారించగా.. తాగిన మైకంలోనే అలా చేసినట్లు పేర్కొన్నాడట..
అయితే ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ ఎక్కడుందో తనకు తెలీదని కానీ తాను రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్న వాటికి సంబంధించిన ఆధారాలు ఐఫోన్ లో పొందుపరిచినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపాడని సమాచారం. మరోవైపు ఈయన ఆ ఫోన్ ను కూడా ఉదయం మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే సూసైడ్ నోట్ ఎలా బయటికి వచ్చిందని సీపీ సజ్జనార్ ప్రశ్నించగా.. అందుకు ఉదయ్ సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.
మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసు నమోదైన మర్నాడే అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అతను మోతాదుకు మించి మద్యం తాగడం వల్లే ఎక్కువ సమయం మత్తులో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఉదయ్ కి మరో ఇద్దరు మహిళలతోనూ సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం సూసైడ్ నోట్ బయటికి రావడం పై ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడి పాత్ర ఉందా అనే కోణంలో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ గా ఈ కేసులో అతడిని కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సూసైడ్ నోట్ కేవలం ఒక డ్రామానేనా? ప్లాన్ ప్రకారమే దానిని మీడియాకు లీక్ చేశారా ? లేక కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నమా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్టు సమాచారం.. కాగా ఈ విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు మరోసారి ఉదయ్ ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.












