సమయం.. ఉదయం 6 గంటలు.. చాలా మంది ఉద్యోగులు ఇంకా తమ డే.. ని కూడా మొదలు పెట్టకముందే.. కొందరి ఇన్‌బాక్స్‌ల్లోకి ఒక మెయిల్ వచ్చింది.
“Today is your last working day.”
అంటే.. ఇవాళ్టి నుంచే మీ ఉద్యోగం లేదు.
టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత మొదలైంది. ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ చెప్పిన కారణం.. ప్రస్తుత వ్యాపార అవసరాలు, విస్తృత సంస్థాగత మార్పులు. తాజా రౌండ్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో మాత్రం ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు.
అయితే.. ఒరాకిల్‌లోనే ఎందుకు పదేపదే లేఆఫ్స్ జరుగుతున్నాయి? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే.. ఒరాకిల్ ఆఫీసుల నుంచి బయటకు వచ్చి మొత్తం టెక్ ప్రపంచాన్ని చూడాలి. ఒరాకిల్ ఇప్పటికే ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు పడిపోయింది. అంటే సుమారు 21 వేల ఉద్యోగాలు.. దాదాపు 13 శాతం వర్క్‌ఫోర్స్ తగ్గింది. ఇప్పుడు మరో రౌండ్.
ఒరాకిల్ ఏం చేస్తోంది?
ఒరాకిల్ ఏఐ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఏఐ అంటే కేవలం చాట్‌బాట్ కాదు. దాని వెనుక వేలాది సర్వర్లు, డేటా సెంటర్లు, చిప్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ కొత్త ఏఐ ప్రపంచంలో పోటీ పడేందుకు ఒరాకిల్ భారీ స్థాయిలో డేటా సెంటర్లపై పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడుల్లో పెద్ద భాగం ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది.
ఏఐని నిర్మించడానికి డబ్బు కావాలి. డబ్బు పెట్టడానికి ఖర్చులు తగ్గించాలి. ఖర్చులు తగ్గించాలంటే.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి.
ఇది ఇప్పుడు టెక్ పరిశ్రమలో కనిపిస్తున్న కొత్త సమీకరణంగా మారుతోంది. అంటే.. ఒకప్పుడు టెక్ కంపెనీలు ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పేవి. ఇప్పుడు అదే ఏఐ కోసం పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు తమ ప్రస్తుత ఉద్యోగాల ఖర్చును తగ్గిస్తున్నాయి. వాస్తవానికి ఇది ఒరాకిల్‌కే పరిమితం కాలేదు.
2026లో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లక్షకు పైగా ఉద్యోగాలు తగ్గాయి. సెప్టెంబర్ మొదటి పది రోజుల్లోనే వేలాది టెక్ ఉద్యోగాలు పోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలు ఒకవైపు రీస్ట్రక్చరింగ్, కాస్ట్ కటింగ్ చేస్తూనే.. మరోవైపు ఏఐ, క్లౌడ్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తించాలి. ప్రతి లేఆఫ్‌కు ఏఐ ఒక్కటే కారణం కాదు. కంపెనీల అప్పులు, బిజినెస్ మోడల్ మార్పులు, మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల ఒత్తిడి, సంస్థల పునర్వ్యవస్థీకరణ.. ఇవన్నీ కూడా కారణాలే. నిపుణుల విశ్లేషణ ప్రకారం కొన్ని కంపెనీలు ఏఐని లేఆఫ్స్‌కు కారణంగా చూపుతున్నప్పటికీ.. వాస్తవానికి కాస్ట్ కటింగ్, వ్యాపార మార్పులు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. కానీ.. ఏఐ మాత్రం ఈ మార్పును వేగవంతం చేస్తోంది.
ముఖ్యంగా రొటీన్ టెక్నికల్ పనులు, కస్టమర్ సపోర్ట్, కోడింగ్‌లోని కొన్ని దశలు, డేటా ప్రాసెసింగ్, కంటెంట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు.. వీటిలో ఒక ఉద్యోగి చేసే పనిని ఏఐ టూల్స్ వేగంగా పూర్తి చేయగలుగుతున్నాయి. దీంతో కంపెనీల లెక్క మారుతోంది. ఇంతమంది ఉద్యోగులు ఎందుకు? ఏఐ టూల్స్‌తో ఇదే పనిని తక్కువ మందితో చేయలేమా? అనే ప్రశ్న ఇప్పుడు మేనేజ్‌మెంట్ స్థాయిలో మొదలైంది. అందుకే ఒరాకిల్‌లో వచ్చిన ఈ ఉదయం 6 గంటల మెయిల్‌ను కేవలం ఒక లేఆఫ్ వార్తగా చూడటం సరిపోదు. ఇది టెక్ ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద మెసేజ్.
AIపై భారీ పెట్టుబడులు...
కంపెనీలు ఏఐపై బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగుల ఖర్చును తగ్గిస్తున్నాయి. అంటే రేపటి టెక్ కంపెనీ.. ఎక్కువ మంది ఉద్యోగులతో ఉండే కంపెనీనా? లేక తక్కువ మంది ఉద్యోగులు, ఎక్కువ ఏఐ టూల్స్‌తో నడిచే కంపెనీనా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్పష్టమవుతుంది.
కానీ ఒక విషయం మాత్రం ఇప్పటికే కనిపిస్తోంది. టెక్ ప్రపంచంలో పోటీ ఇప్పుడు కేవలం మనిషి వర్సెస్ మనిషి కాదు. మనిషి వర్సెస్ ఏఐ కూడా కాదు. ఏ కంపెనీ ఏఐని వేగంగా ఉపయోగించుకోగలదు? ఏ కంపెనీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకత సాధించగలదు? అదే అసలు పోటీ.
ఒరాకిల్‌లో వచ్చిన ఈ లేఆఫ్స్.. ఆ మారుతున్న టెక్ ప్రపంచానికి మరోసారి పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాలను తగ్గించి.. కొత్త రకం ఉద్యోగాలనే మిగులుస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ టెక్ పరిశ్రమ ముందున్న అసలు ప్రశ్న.









