మొబైల్ యూజర్లకు మరోసారి రీఛార్జ్ ధరల పెంపు భయం మొదలైంది. టెలికాం కంపెనీలు రానున్న 3 నుంచి 6 నెలల్లో ప్రీపెయిడ్ టారిఫ్‌లను 10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్‌లను తొలగించగా.. జియో రూ.300తో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ఏడాది పాటు టారిఫ్ సవరణ నుంచి రక్షణ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో రీఛార్జ్ ధరలు పెరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ధరల పెంపు అమల్లోకి వస్తే.. తరచూ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అందుకే ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లను ఎంచుకోవడం ద్వారా ప్రస్తుత ధరల వద్ద ఎక్కువ కాలం ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న కొన్ని వార్షిక ప్లాన్లు ఏంటో చూద్దాం.
ముందుగా రిలయన్స్ జియో విషయానికి వస్తే.. రూ.3,999 ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ సదుపాయం కూడా ఉంటుంది. జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, జియోటీవీ, ఫ్యాన్‌కోడ్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే 18 నెలల పాటు గూగుల్ జెమినై ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ.3,599 జియో ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియోటీవీ ప్రో ప్యాక్ వోచర్, 120 జీబీ అదనపు డేటా, 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 18 నెలల గూగుల్ జెమినై ప్రో సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఎయిర్‌టెల్‌లో రూ.3,599 ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
అర్హులైన వినియోగదారులకు 5జీ కనెక్టివిటీ ఉంటుంది. రూ.3,999 ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 12 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. వార్షిక వ్యాలిడిటీతో జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. రూ.1,849 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, మొత్తం 3,600 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.2,249 ప్లాన్‌లో 30 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి.
రూ.3,599 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు హీరో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింజ్ ఆల్‌నైట్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రూ.3,699 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. రూ.3,799 ప్లాన్‌లో ఇదే తరహా ప్రయోజనాలతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3,999 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
అధిక ప్రయోజనాలు కోరుకునేవారికి రూ.4,999 ప్లాన్ కూడా ఉంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 200 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియోహాట్‌స్టార్, సోనీలీవ్, అమెజాన్ ప్రైమ్ లైట్ సహా 18కు పైగా ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక రూ.1,189 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 50 జీబీ డేటా లభిస్తుంది.
మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, తమ డేటా, కాలింగ్ అవసరాలకు సరిపోయే వార్షిక ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. అయితే ఏ ప్లాన్ తీసుకునే ముందు అయినా.. ప్రస్తుత ధర, వ్యాలిడిటీ, డేటా పరిమితి, ఓటీటీ ప్రయోజనాలు, 5జీ అర్హత వంటి వివరాలను సంబంధిత టెలికాం కంపెనీ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఒకసారి పరిశీలించడం మంచిది.











