రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో రెండేండ్లు సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల హీట్‌ను పెంచాయి. అందుకు అధికార పార్టీ కారణమని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టారని, ప్రజలకు సంబంధించిన భూములను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ పొలాలు, ప్లాట్లు, నిర్మించిన భవనాలను సైతం 22ఏ జాబితాలోకి తీసుకురావడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోవడంతో లావాదేవీలు కూడా నిలిచిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, గతంలో ధరణి వైబ్‌సైట్ వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన భూభారతి వలన సమస్యలు మరింత జఠిలం అయ్యాయి కానీ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
పట్టా భూములను నిషేధితా జాబితాలో చేర్చడం వలన అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం ఉంచిన భూమిని అమ్ముకోలేక పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో వేల మంది విద్యార్థుల విదేశీ ప్రయాణాలు నిలిచిపోగా.. వివాహాలు సైతం వాయిదా పడినట్టు తెలుస్తోంది.కమీషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22ఏ అస్త్రాన్ని వాడి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అటు అన్నదాతలు, ఇటు సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో 22ఏపై చర్చ జరగొద్దనే తమను సస్పెండ్ చేశారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రతిపక్ష ఆరోపణలు, విమర్శలు.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో MCHRDలో కీలక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. 22/Aపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో BRS ప్రభుత్వం ఉంచిన భూముల వివరాలు, కాంగ్రెస్ అధికారంలో రాగానే నిషేధిత జాబితా నుండి తొలగించిన భూముల వివరాలను మంత్రులకు సీఎం వివరించనున్నట్టు తెలుస్తోంది.దీనికి తోడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.










