కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం.. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు ప్రతీక. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక ఈ క్షేత్రంలో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ఆచారాల్లో ఒకటి.. తిరుమల కొండపై పూలు ధరించకపోవడం.
అయితే తిరుమలలో ఈ నియమం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది తెలుసుకుంటే.. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఏడుకొండల పైన వికసించే ప్రతి పువ్వు, ప్రతి పత్రం కేవలం శ్రీవారి సేవకే అంకితం కావాలనేది తిరుమలలో తరతరాలుగా వస్తున్న పవిత్ర విశ్వాసం. అందుచేతే భక్తులు కొండపై పూలు ధరించరని చెబుతారు..
అలాగే ఈ సాంప్రదాయం వెనుక పురాణాల్లో, స్థల పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన కాలంలో స్వామివారి అలంకరణకు ఉపయోగించిన నిర్మాల్యాన్ని పవిత్ర ప్రసాదంగా భావించి భక్తులకు ఇచ్చేవారు. అయితే శ్రీవైష్ణవ పరంపరలో స్వామివారి సేవకు అంకితమైన పూల విషయంలో అత్యంత నియమం పాటించేవారు.
స్థల పురాణం ప్రకారం.. పూర్వం శ్రీశైల పూర్ణుల (తిరుమల నంబి) సంప్రదాయంలో స్వామివారి కైంకర్యం కోసం కోసిన పూలను లేదా స్వామివారికి అలంకరించాల్సిన పవిత్ర పుష్పాలను, స్వామి సమర్పణకు ముందే దుర్వినియోగం చేయడం అనేది పరిమళ ద్రోహం లేదా ఆచార ఉల్లంఘనగా పరిగణించబడింది. స్వామివారి సేవకై ఉద్దేశించిన పూలను మానవ భోగానికి ఉపయోగించకూడదని అప్పట్లోనే స్పష్టమైన నియమాన్ని రూపొందించారు.
అప్పటినుంచి కొండపైన లభించే ప్రతి పుష్పం కేవలం వేంకటేశ్వరుని కైంకర్యానికే చెందాలనే నియమం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, స్వామివారికి అలంకరించిన పూలను కూడా కొండపై మనుషులెవ్వరి తొక్కిసలాటలో పడకుండా, అత్యంత పవిత్రంగా శ్రీవారి ఆలయంలోని పూల బావి లోనే విసర్జించే అనవాయితీ ప్రారంభమైంది. ఇక మహిళలు కొండపై పూలు పెట్టుకోకపోవడం అనేది నిషేధం కాదు.. అది ఆ శ్రీనివాసుడి పట్ల భక్తులు చూపే అనన్యమైన భక్తి, గౌరవానికి సంకేతం. తిరుమల నిత్య కల్యాణ వేంకటేశ్వరుడి దివ్య అలంకారానికి భంగం కలగకుండా పాటించే ఈ ఆచారం సనాతన ధర్మపు విశిష్టతను చాటిచెబుతోంది..









