EPFO: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది జీవితాంతం ఉపయోగపడే అతిపెద్ద ఆర్థిక భరోసా. ప్రతినెలా వచ్చే జీతం నుంచి కొంత మొత్తం, దానికి సమానంగా కంపెనీ వాటా పీఎఫ్ అకౌంట్లో జమ కావడం చాలా కామన్ రూల్. అయితే చాలామంది ఉద్యోగులు జీతం రాగానే శాలరీ స్లిప్‌లో పీఎఫ్ కట్ కావడం చూసి, ఆ మొత్తం అమౌంట్ తమ పీఎఫ్ అకౌంట్‌లో పడిపోయిందని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ అక్కడే అసలు మోసం స్టార్ట్ అవుతోంది.
శాలరీ స్లిప్‌లో కనిపిస్తే సరిపోదు.. ఖాతాలో పడాల్సిందే
జీతంలో పీఎఫ్ డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా చేతులెత్తేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం ప్రతినెలా 15వ తేదీ లోపు ఉద్యోగి, యాజమాన్యం వాటాలను పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సిందే. ఉద్యోగులు కేవలం UAN నంబర్‌ను యాక్టివేట్ చేసి వదిలేయడం వల్ల, కంపెనీ ప్రతి నెలా డబ్బులు వేస్తుందా లేదా అన్నది చివరిదాకా గుర్తించ లేకపోతున్నారు. రిటైర్మెంట్ సమయంలోనో లేక కంపెనీ మారేటప్పుడో అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో చిల్లిగవ్వ కూడా జమ కాకపోవడం చూసి గుండెలు బాదుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఖాతాలో డబ్బులు పడుతున్నాయో లేదో ఇలా చెక్ చేసుకోండి:
ఉద్యోగులు తమ సొమ్ము భద్రంగా జమ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్‌వో నాలుగు సింపుల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. పీఎఫ్ పాస్‌బుక్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ UAN, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అక్కడ కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకుంటే ఉద్యోగి వాటా, సంస్థ వాటా పూర్తి వివరాలతో పాస్‌బుక్ కనిపిస్తుంది. శాలరీ స్లిప్‌లో కట్ అయిన మొత్తానికి ఇది సరిపోలిందో లేదో చూసుకోవచ్చు. అలాగే ఉమాంగ్ యాప్‌తో స్మార్ట్‌ఫోన్ ద్వారా సింపుల్‌గా పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకుని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్ఎమ్ఎస్ లేదా మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
కంపెనీ డబ్బులు యాడ్ చేయకపోతే ఇలా చేయండి
మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ కాలేదని తెలిస్తే వెంటనే మీ సంస్థలోని హెచ్ఆర్‌ను కలవండి. ఆయన నుంచి రెస్పాన్స్ లేకపోతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈపీఎఫ్‌వో అధికారిక గ్రీవెన్స్ పోర్టల్ అయిన EPFiGMS లో కంపెనీపై డైరెక్ట్‌గా కంప్లైంట్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పీఎఫ్ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటారు. ఒకవేళ కంపెనీ లేట్‌గా డబ్బులు జమ చేసినా అప్పుడు ఉద్యోగుల వడ్డీకి ఎలాంటి నష్టం రాదు. ఆ ఆలస్యానికి అయ్యే వడ్డీతో పాటు పీఎఫ్ శాఖ విధించే పెనాల్టీని కూడా పూర్తిగా కంపెనీయే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్‌ని చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.









