దునియా

UCC: బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన జేడీయూ.. బిహార్‌లో యూసీసీ అమలుకు నో!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, మిత్రపక్షం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమల్లోకి తెస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు జేడీయూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

UCC : దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, మిత్రపక్షం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమల్లోకి తెస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు జేడీయూ గట్టి కౌంటర్ ఇచ్చింది. బిహార్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి అమలును అంగీకరించే ప్రసక్తే లేదని తాజాగా నితీశ్ కుమార్ పార్టీ కుండబద్దలు కొట్టింది.

పార్లమెంట్‌లో మద్దతిచ్చాం.. కానీ రాష్ట్రంలో నో

బిహార్‌లో యూసీసీ అమలుపై జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర స్థాయిలో పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతిచ్చినప్పటికీ, తమ రాష్ట్ర పరిధిలో మాత్రం దీన్ని అమలు చేయనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ పార్టీ అధినేత నితీశ్ కుమార్ వైఖరి ఇప్పటికే చాలా స్పష్టంగా ఉందని తేల్చిచెప్పారు.

మిత్రపక్షాల దయతోనే సర్కార్..

బిహార్‌లో సామ్రాట్ చౌధరి నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది కదా.. అమలు ఎందుకు సాధ్యం కాదంటూ మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నకు శ్యామ్ రజక్ ఘాటుగా స్పందించారు. "సీఎం పీఠంపై బీజేపీ నేత ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నడుస్తోంది మాత్రం మిత్రపక్షాలైన మా మద్దతుతోనే అన్న విషయం గుర్తుంచుకోవాలి" అని హెచ్చరించారు. తమ మద్దతు లేకుండా బిహార్‌లో యూసీసీ అమలు ఆలోచన కూడా చేయలేరని పరోక్షంగా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ పాత విద్వేష రాజకీయాలు

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) బీజేపీపై నిప్పులు చెరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల్లో ఎదురుదెబ్బలు తగలడంతోనే బీజేపీ మళ్లీ పాత విద్వేష రాజకీయాలను తెరపైకి తెస్తోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిహార్ ప్రజల నరనరాల్లో లౌకికవాదం నిండిపోయిందని, విభజన రాజకీయాలు ఇక్కడ సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో బలవంతంగా ఉమ్మడి పౌరస్మృతిని రుద్దాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని, గట్టిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత, మరోవైపు సొంత కూటమిలోని ప్రధాన మిత్రపక్షం జేడీయూ బహిరంగంగా 'నో' చెప్పడంతో బిహార్‌లో యూసీసీ వ్యవహారం ఎన్డీయేకు పెద్ద తలనొప్పిగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే నితీశ్ పార్టీ ఇలా అడ్డం తిరగడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#UCC#Uniform Civil Code#UCC Bihar#Bihar UCC#Bihar Politics#JD(U)#JDU#Nitish Kumar#BJP#NDA#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి