తెలంగాణ

KTR: కేటీఆర్ స్టాఫ్‌పై దాడి అంటూ ప్రచారం.. అసలు నిజం చెప్పిన పోలీసులు!

రచన: Mahesh4 నిమిషాల పఠనం

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరో తీవ్ర దుమారం చెలరేగింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై దాడి జరిగిందన్న అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరో తీవ్ర దుమారం చెలరేగింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై దాడి జరిగిందన్న అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లోని విచారణ గదిలోనే ముసుగులు ధరించిన వ్యక్తులు ఈ దాడికి ఒడిగట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేయగా, పోలీస్ యంత్రాంగం ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.

పోలీస్ స్టేషన్‌లోనే దాడి యత్నం..

కేటీఆర్ పీఏ మహేందర్‌, పీఆర్వో మహేశ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగిందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. విచారణ గదిలో ఉన్న వారి వద్దకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా దాడి చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్స్ గట్టిగా కేకలు వేయడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. పోలీసుల అండదండలతోనే ఈ ఘటన జరిగిందని హరీశ్ రావు చెప్పారు.

రేవంత్ పాలనలో గూండారాజ్యం

తన వ్యక్తిగత సిబ్బందిపై పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాడి జరగడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లలోనే విపక్ష నేతల సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న కేటీఆర్, ఈ ఘటనపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రచారంలో వాస్తవం లేదు..

హరీశ్ రావు చేసిన ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్‌లో ఎవరిపైనా ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. గణేశ్ మండపం వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి కోరేందుకు కొందరు స్థానిక యువకులు పీఎస్‌కు వచ్చారని, ఆ సమయంలో అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వారిని కూర్చోబెట్టి పోలీసులు మాట్లాడుతుండటాన్ని చూసి ఆ యువకులు వారితో వాగ్వాదానికి దిగారని వివరించారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే ఆ యువకులను స్టేషన్ నుంచి బయటకు పంపించేశారని పోలీసులు తెలిపారు. తమ సమక్షంలోనే కేటీఆర్ స్టాఫ్‌పై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

#KTR#KT Rama Rao#KTR Staff#KTR Staff Attack#KTR PA Mahesh#KTR PRO Mahender#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి