ఏపీ

kadapa: పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. గాలిలోకి గన్ ఫైర్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించిన కడప జిల్లా.. కాలం మారుతున్న కొద్దీ ఆ ముద్ర నుంచి బయటపడుతున్నట్టే కనిపించింది. ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అనిపించినప్పటికీ.. అప్పుడప్పుడూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు మాత్రం పాత జ్ఞాపకాలను మళ్లీ కదిలిస్తున్నాయి.

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించిన కడప జిల్లా.. కాలం మారుతున్న కొద్దీ ఆ ముద్ర నుంచి బయటపడుతున్నట్టే కనిపించింది. ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అనిపించినప్పటికీ.. అప్పుడప్పుడూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు మాత్రం పాత జ్ఞాపకాలను మళ్లీ కదిలిస్తున్నాయి. తాజాగా పులివెందులలో జరిగిన ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పులివెందులలో వినాయక మండపం వద్ద ఇద్దరు టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ మధ్య మొదలైన గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం. పుష్పనాథ్ రెడ్డిపై విజయ్ కుమార్ చేయి చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు హజ్ కమిటీ ఛైర్మన్ భాషా అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ.. రాళ్ల దాడి ఆగలేదని సమాచారం. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో.. భాషా గన్‌మెన్ గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో విజయ్ కుమార్ ఇంటి వద్ద రెండు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాదానికి కారణాలు ఏంటనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనతో కడప జిల్లా రాజకీయాల్లో మరోసారి ఫ్యాక్షన్ సంస్కృతి పుట్టుకొస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. గతంలో ఇక్కడ రాజకీయ విభేదాలు వ్యక్తిగత కక్షలు, వర్గపోరాటాల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ చరిత్ర నుంచి క్రమంగా బయటపడుతున్న సమయంలో.. ఇలాంటి ఘటనలు జరగడం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా అధికార టీడీపీకి చెందిన నేతల మధ్యే ఘర్షణ జరగడంతో.. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటుంది.. బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కడపలో.. ఇలాంటి ఘర్షణలకు తావులేకుండా రాజకీయ పార్టీలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం మరోసారి స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#AP#kadapa#pulivendula#gun firing#TDP leaders#crime news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి