గురుగ్రామ్ లో దారుణం
కారును వెంబడించి ఢీకొట్టిన ఘటన
హిట్ అండ్ రన్ కేసులో సంచలనంగా వీడియోలు
జాలిపడితే ఆపలేదెందుకు?.. నిందితుడికి సియా సూటి ప్రశ్న
రోడ్డుపై మహిళలు బైక్ నడపొద్దా? బయటకు వెళ్తే ఎవరైనా వెంబడిస్తే భరించాలా? రోడ్డుపై ఎవరైనా దూకుడుగా వాహనం నడిపి భయపెడితే మౌనంగా ఉండాలా? ఒకవేళ ప్రమాదం జరిగితే.. కనీసం ఆపి బాధితురాలు ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత కూడా లేదా..? గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ మన ముందుంచుతోంది.
బైక్‌పై వెళ్తున్న మహిళను ఓ కారు వెంబడించడం.. ఆ తర్వాత బైక్‌ను ఢీకొట్టడం.. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా వెళ్లిపోవడం వంటి ఆరోపణలతో నమోదైన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై బైక్‌లు నడిపే మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, రోడ్ రేజ్, భద్రతపై ఆందోళన పెరుగుతోంది.
అసలేం జరిగింది?
సెప్టెంబర్ 13. ఉదయం సుమారు 7 గంటల సమయం. బైకర్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ సియా తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తోంది. అందరూ వేర్వేరు మోటార్‌సైకిళ్లపై ప్రయాణిస్తున్నారు. వారంతా బైకర్ బార్న్ కేఫ్ వైపు వెళ్తుండగా గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఓ తెల్లటి మారుతి సుజుకి సియాజ్ వారిని వెంబడించింది.
కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించారని, బైక్‌కు పదేపదే దగ్గరగా వచ్చారని, ఆపేందుకు ప్రయత్నించారని చెబుతోంది సియా. ఇది సాధారణ ఘటనలా కాకుండా.. తన భద్రతకే ముప్పుగా మారిందని భావించే స్థాయికి వెళ్లిందన్నది బాధితురాలి వాదన.
బైక్ ముందుకు వెళ్తుండగా కారు తనను అడ్డుకుంటూ వచ్చి ఢీకొట్టినట్టు సియా చెబుతోంది. ఢీకొట్టిన తర్వాత బైక్ కొంత దూరం పాటు రోడ్డుపై దొర్లుతూ ముందుకెళ్లింది. ఆ తర్వాత కారు అక్కడ ఆగలేదు. బాధితురాలి స్నేహితులు కారును వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ.. అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక వ్యక్తి వాహనాన్ని ఢీకొడితే.. కనీసం ఆపి అవతలి వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత లేదా?
‘‘జాలిపడ్డాను’’ అంటే.. మరి ఎందుకు ఆపలేదు?
ఈ ఘటన తర్వాత నిందితుడు కల్యాణ్ బైన్స్‌లా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఆ బైక్‌పై మహిళ ఉన్న విషయం తెలియదని, ఘటనకు సంబంధించిన ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెబుతున్నారు కల్యాణ్. బైకర్లు రోడ్డుపై వేగం పెంచుతూ, తగ్గిస్తూ వెళ్లారని వాదిస్తున్నాడు.
ఇక్కడే మరో వాదన తెరపైకి వస్తోంది. వాళ్లు అలా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తే.. ఎందుకు అంత దూరం వెంబడించాలి? ట్రాఫిక్‌లో ఎవరి డ్రైవింగ్ అయినా నచ్చకపోతే.. దూరంగా వెళ్లిపోవచ్చు. పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. కానీ ఒక మహిళ బైక్‌పై వెళ్తున్నప్పుడు ఆమెను వెంబడించడం, దగ్గరకు వెళ్లడం, ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడం.. చివరకు ఢీకొట్టడం. ఇదంతా కావాలనే చేసినట్టుగా లేదు..? నిజంగా బాధపడితే.. కారు ఎందుకు ఆగలేదు?
రెండు వీడియోలు.. ఎన్నో ప్రశ్నలు
ఈ కేసులో వీడియోలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. బయటకు వచ్చిన వీడియోల్లో ఒకదానిలో కారు లేన్ మారుతూ బైక్ వైపు వెళ్లి ఢీకొట్టిన దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియో బైక్‌పై ఉన్న కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలో కారు ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారుతూ బైక్‌ను ఢీకొట్టడం, ఢీకొన్న తర్వాత బైక్ ను కారు లాక్కెళ్లడం, ఆ తర్వాత బైకర్ రోడ్డుపై పడిపోవడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక ప్రమాదం జరిగిన తీరు వీడియోలో కనిపిస్తుంటే.. ఆ వీడియోలను పూర్తిగా పరిశీలించి నిజానిజాలు తేల్చడం పోలీసుల బాధ్యత కాదా? ఎవరెంత వేగంగా వెళ్లారు? ఎవరు ఎవరిని వెంబడించారు? కారు ఏ లేన్ నుంచి ఏ లేన్‌లోకి వచ్చింది? ఢీకొట్టిన తీరు ఎలా ఉంది? ప్రమాదం తర్వాత కారు ఎందుకు ఆగలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులోనే బయటకు రావాలి.
మహిళ బైక్ నడిపితే.. ఎందుకీ వేధింపులు?
ఈ ఘటనలో అత్యంత బాధ కలిగించే అంశం ఇదే. ఒక మహిళ బైక్ నడుపుతోంది అంటే ఆమెను రోడ్డుపై ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదు. ఆమె వేగంగా వెళ్తుందా? నెమ్మదిగా వెళ్తుందా? స్పోర్ట్స్ బైక్ నడుపుతుందా? సాధారణ బైక్ నడుపుతుందా? అనేది అనవసరం. ఎక్కడైనా రూల్స్ బ్రేక్ చేసినట్టు అనిపిస్తే కంప్లైంట్ చేయాలి. మహిళలు రోడ్డుపైకి వస్తే భద్రత గురించి ఒకటికి.. రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే.. అది కేవలం ఒక మహిళ సమస్య కాదు. మొత్తం సమాజం వైఫల్యం.
బైక్ నడపడం పురుషుల హక్కు మాత్రమే కాదు. మహిళలకు కూడా అదే రోడ్డు.. అదే హక్కు.. అదే భద్రత ఉండాలి. ప్రమాదం కంటే భయంకరమైనది.. ప్రమాదం తర్వాత ప్రవర్తన. ఘటన జరిగిన తర్వాత మనిషిగా ఎలా స్పందిస్తామన్నదే అసలు విషయం.
ఎవరినైనా ఢీకొట్టామంటే వాహనం ఆపాలి. గాయపడ్డారా? సహాయం అవసరమా? అని చూడాలి. అవసరమైతే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారంటే.. బాధితురాలికి భయం మరింత పెరుగుతుంది. ఇక్కడే సియా వాదనలో నిజముందనిపిస్తోంది.
ఎవరి తప్పు ఎంత అనేది దర్యాప్తు తేలుస్తుంది. కానీ అంతకంటే ముందే మనం అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒక మహిళ ధైర్యంగా బైక్ ఎక్కి రోడ్డుపైకి వస్తే.. ఆమె తన జర్నీని భయంతో మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆమెకు రోడ్డుపై సమాన హక్కు ఉంది. సురక్షితంగా ప్రయాణించే హక్కు ఉంది. ప్రమాదం జరిగితే సహాయం పొందే హక్కు కూడా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు దీనిని గుర్తించాలి.












