వినాయకచవిత పండుగ సందర్భంగా గల్లీగల్లీలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఘనంగా పూజలు అందుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ వినాయకులు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. తీరొక్క గణపయ్యలు వాడవాడాలా కొలువుదీరడంతో యువత, చిన్నారుల సందడి నెలకొంది.నిన్నటివరకు వరుసగా సెలవులు రావడంతో గణపయ్య మండపాల వద్ద కోలాహలం నెలకొంది.సాయంత్రం వరకు వినాయకులను డప్పుచప్పుళ్లు, ఊరేగింపుల నడుమ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్టించారు.
సాధారణంగా విగ్రహాన్ని ప్రతిష్టించాక నవరాత్రులు పూర్తయ్యాక గణపతిని గంగమ్మ ఒడికి పంపిస్తారు. అయితే,నగరాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో రోజు నుంచే నిమజ్జనాలు కొనసాగుతాయి. ఇదిలాఉండగా,విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే ఓ చోట గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్ గ్రామంలో ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు సమాచారం. అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ నెలకొంది.
పోలీసులు జోక్యం చేసుకొని విగ్రహాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టొద్దని వేరే చోట ప్రతిష్టించుకోవాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వర్గం వారు.. గణనాథుడికి ఎలాంటి పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. స్థలం కోసం పంతానికి పోయి పూజలు నిర్వహించకుండా నిమజ్జనం చేయడం మంచిదికాదని, పూజలు చేశాక నిమజ్జనం చేసిన బాగుండేందని కొందరు అంటున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2099465650481909973?s=20









