రాష్ట్రంలో 22 ఏ నిషేధిత భూముల అంశంపై మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తాజాగా స్పందించారు.22 ఏ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకలా? రెవెన్యూ,గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరొకలా? మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే రెవెన్యూ చట్టాలు మార్చడం సరికాదని, దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలని రఘునందన్ రావు స్పష్టంచేశారు. 22ఏ అంశం మీద తెలంగాణ రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
గత ప్రభుత్వం తెచ్చిన ధరణి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 22ఏ మీద మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 22ఏ మీద మాట్లాడితే బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అని మంత్రి పొంగులేటి అనడం సరికాదన్నారు.
ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ అదే అంశం మీద మాట్లాడుతాయని చెప్పారు. ఆ మాత్రందానికే ప్రతిపక్షాలు ఒక్కటే అనడం మంచిది కాదన్నారు. తనకు బీఆర్ఎస్ చుట్టం కాదని, కాంగ్రెస్ శత్రువు కాదన్నారు. 22ఏ విషయంలో గులాబీ నేతలు మాట్లాడకముందే తాను సిద్దిపేటలో మాట్లాడానని వివరించరారు.22ఏ విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు భావిస్తే వారిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.
ఇక అసైన్డ్ చట్టాలను రద్దు చేయబోతున్నారని ప్రచారం నడుస్తోందని, అసైన్డ్ భూములపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూమి ఎన్ని ఎకరాల్లో ఉందనే లెక్కలు తీయాలని చెప్పారు. 22ఏ విషయంలో ఎలాంటి తప్పు జరగకపోతే మంత్రి పొంగులేటి ఎంతుకు క్షమాపణలు చెప్పారు అని అడిగారు. ధరణి లోపాలు సరిదిద్ది పేదలకు న్యాయం చేశామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులో ఎంత మందిని గుర్తించి శిక్షించారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు ఏ భూములు 22ఏ కింద ఉన్నాయో.. పబ్లిక్ డాక్యుమెంట్ రూపంలో ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.












