సినిమా

NTR-AlluArujun : విజ‌య్ దారిలో ఎన్టీయార్, బ‌న్నీ.. పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మేనా..?

రచన: Kumar9 నిమిషాల పఠనం

హీరోలు పార్టీలు పెట్ట‌డం, పొలిటిక‌ల్‌గా హిట్ కొట్టడం, సీఎం పీఠ‌మెక్క‌డం మ‌న దేశంలో కొత్తేం కాదు. ప్ర‌త్యేకించి ద‌క్షిణాదిలో ఇది సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ఫార్ములా కూడా. మొన్నా మ‌ధ్య త‌మిళ‌నాట ద‌ళ‌ప‌తి విజ‌య్ ఘ‌న విజ‌యం సాధించి.. సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ మొద‌లైంది.

హీరోలు పార్టీలు పెట్ట‌డం, పొలిటిక‌ల్‌గా హిట్ కొట్టడం, సీఎం పీఠ‌మెక్క‌డం మ‌న దేశంలో కొత్తేం కాదు. ప్ర‌త్యేకించి ద‌క్షిణాదిలో ఇది సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ఫార్ములా కూడా. మొన్నా మ‌ధ్య త‌మిళ‌నాట ద‌ళ‌ప‌తి విజ‌య్ ఘ‌న విజ‌యం సాధించి.. సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ మొద‌లైంది. జూనియ‌ర్ ఎన్టీయార్, అల్లు అర్జున్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నేది దాని సారాంశం. అప్ప‌టి నుంచి దీనిపై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా అల్లు అర్జున్ పొలిటిక‌ల్ ఎంట్రీపై సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ మొద‌లైంది. త్వ‌ర‌లోనే ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మంటూ వార్త‌లొస్తున్నాయి. హైలెవ‌ల్ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో కూడా దీనిపై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాద‌న్న‌ట్టు.. ఏదో ఒక చ‌ర్చ‌యితే జ‌రిగి ఉంటుంది. అందుకే ఈ ప్ర‌చారం మొద‌లైందేమో.

మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ కెరీర్... పుష్ప సినిమా త‌ర్వాత ఓ రేంజ్‌లో పెరిగింది. బ‌న్నీ కెరీర్‌ను బిఫోర్ పుష్ప‌.. ఆఫ్ట‌ర్ పుష్ప అన్న‌ట్టుగా చూడాల్సిందే. ఆ సినిమా మొత్తం రాజ‌కీయాల చుట్టే తిరుగుతుంది. అందుకేనేమో ఆ సినిమా రిలీజ‌య్యాక‌.. బ‌న్నీ ఫ్యాన్స్ చాలా మంది ఆయ‌న్ని రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు అల్లు అర్జున్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనేది సందేహ‌మే. కానీ.. ఆయ‌న ఆ దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు మాత్రం ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్‌తో బ‌న్నీ భేటీ అయ్యార‌ని కూడా సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది.

ఈ చ‌ర్చ ఇక్క‌డితో ఆగ‌లేదు. బ‌న్నీ పార్టీ పెడితే ఏపీలో పెడ‌తారా లేక తెలంగాణ‌లోనా అనే దానిపై కూడా మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ సెటిలైంది తెలంగాణ‌లోనైనా, ఆయ‌న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఏపీది. అందుకే ఆయ‌న పార్టీ అంటూ పెడితే అది ఏపీకే ప‌రిమిత‌మ‌వుతుందని కొంద‌రు చెబుతున్నారు. ఏపీ నాయ‌కులు, సినిమా తారలు తెలంగాణలో పార్టీ పెట్టినా... పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఇప్ప‌టికే ఎన్నోసార్లు రుజువైంది. రాష్ట్రం క‌లిసున్న‌ప్పుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టినా.. ఇక్క‌డ పెద్ద‌గా సీట్లు రాలేదు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌కు ల‌భించిన ఆద‌ర‌ణ కూడా అంతంత మాత్ర‌మే. మొన్నా మ‌ధ్య ష‌ర్మిల కూడా ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యారు. తెలంగాణ‌లో జ‌గ‌న్‌కు అలాంటి రిజ‌ల్టే వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ కూడా ఇక్క‌డ ప్ర‌యోగం చేయ‌క‌పోవ‌చ్చ‌నే తెలుస్తోంది. అల్లు అర్జున్ స‌తీమ‌ణిది తెలంగాణ‌. ఒక‌వేళ తెలంగాణ అల్లుడు అనే కోటాలో ప్ర‌యోగం చేయొచ్చేమోన‌ని కొంద‌రు విశ్లేష‌కుల అభిప్రాయం. కానీ.. అల్లు అర్జున్‌కు ఏపీలోనే మంచి బేస్ దొరుకుతుంద‌ని చెప్పే వారే ఎక్కువ‌.

టీడీపీ తరఫున ప్రచారం..

ఇక జూనియ‌ర్ ఎన్టీయార్ పొలిటిక‌ల్ ఎంట్రీపై జ‌రుగుతున్న చ‌ర్చ కొత్త‌దేం కాదు. పొలిటిక‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం కూడా చేశారు. అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. టీడీపీలోని ఒక వ‌ర్గం ఆయ‌న ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నార‌నే పుకార్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అన్నింటికీ మించి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఇంత‌కంటే ఏం కావాలి..? అందుకే ఎన్టీయార్ పొలిటిక‌ల్ క‌థా చిత్ర‌మ్ ఎప్పుడూ సెన్సేష‌నే. ఐతే ఈ మ‌ధ్య RAW NTR అనే సంస్థ చేసిన ఓ ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లే సృష్టించింది.

తమిళనాడులో విజయ్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుగా సేవా సంస్థలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. ఈ నెల 18న తిరుపతిలో ఓ హోటల్లో ప్రకటన ఉంటుందని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ పూర్తి తప్పని ఎన్టీఆర్ కార్యాలయం తేల్చి చెప్పింది. RAW NTR అనే సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పేరుతో జరిగే కార్యక్రమాలకు తమ‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ ఎపిసోడ్‌కు తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడింది.

జూనియ‌ర్ ఎన్టీయార్, బ‌న్నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారో రారో క్లారిటీగా తెలియ‌దు కానీ.. ఏపీలో కొత్త పార్టీల‌కు స్పేస్ ఉందా..? ఈ అంశం కూడా కీల‌క‌మే. కొత్త పార్టీకి స్పేస్ లేద‌నైతే చెప్ప‌లేం. ఎందుకంటే.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ప్ర‌జ‌లంతా రెండు పార్టీల మ‌ధ్య చీలిపోయారు. ఒక‌వైపు డీఎంకే, మ‌రోవైపు అన్నాడీఎంకే మ‌ధ్యే పోటీ ఉండేది. అక్క‌డ ద్ర‌విడ పార్టీల‌ను కాద‌ని, మ‌రో పార్టీ వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని ఎంతో మంది విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ.. అందరి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ విజ‌య్.. విజ‌యఢంకా మోగించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠ‌మెక్కారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ముందు టీవీకే పార్టీ పోటీలో కూడా ఉండ‌ద‌ని ఎన్నో స‌ర్వేలు చెప్పాయి. మ‌రి రిజ‌ల్ట్ ఏమైంది...? డీఎంకే, అన్నాడీఎంకేల‌ను కాద‌ని టీవీకే అనూహ్య‌మైన విజ‌యాన్ని సాధించింది.

ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీ, టీడీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ. అంత‌మాత్రాన కొత్త పార్టీకి అవ‌కాశం లేద‌నైతే చెప్ప‌లేం. జెన్‌జీ ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఎవ‌రు పార్టీ పెట్టినా ఆద‌రించే అవ‌కాశ‌ముంది. అందుకు తాజా ఉదాహ‌ర‌ణే విజ‌య్ టీవీకే పార్టీ. ఈ క్ర‌మంలోనే.. విజ‌య్ దారిలో ఎన్టీయార్, బ‌న్నీ న‌డుస్తార‌ని, వారిద్ద‌రి పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మని ప్ర‌చారం జ‌రుగుతోంది.

#Cm vijay#NTR#Alluarjun#cinema#tollywood#political entry
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి