Union Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు వేలైంది. ఏ నిమిషంలోనైనా కేంద్ర కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది. నరేంద్రమోదీ ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఈ క్రమంలో ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కీలకం కానుంది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో పలు సంచలన మార్పులు ఖాయమని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరైతే ఈ ఎపిసోడ్‌ను మోదీ 2.O గా ప్రస్తావిస్తున్నారు. అంటే మార్పులు- చేర్పులు ఆ స్థాయిలో ఉంటాయన్న మాట.
ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరగొచ్చు..!
షెడ్యూల్ ప్రకారం 2029లో సాధారణ ఎన్నికలు ఉంటాయి. ఇందుకు ఇంచుమించు మూడేళ్ల సమయముంది. ఈలోగా కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2027లో యూపీ, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీకి ఈ రాష్ట్రాలన్నీ కీలకమే. అందుకే ప్రస్తుతం జరగబోయే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పెరగొచ్చు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు ఎంపీలు.. పార్టీ కార్యక్రమాల వైపు వెళ్లొచ్చు. అంటే ఆయా రాష్ట్రాల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కొందరు నాయకులపై పడొచ్చు.
ఆర్థిక మంత్రి రేసులో పీయూష్ గోయల్, శక్తికాంత దాస్?
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఆ తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి చాలా మంది సీనియర్ మంత్రుల పోర్ట్ ఫోలియోలు మారొచ్చని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె స్థానంలో పీయూష్ గోయల్‌ను కానీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కానీ.. ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించవచ్చు.
ఈసారి తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత..
మహారాష్ట్ర నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాఘవ్ చడ్డా వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత దక్కవచ్చు. ఏపీ నుంచి టీడీపీ కోటాలో మరో ఎంపీకి మంత్రి పదవి దక్కొచ్చని వార్తలొస్తున్నాయి. ఆ పార్టీ కోరుకుంటే ఇప్పటికే ఉన్న కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ శాఖలు మారవచ్చు.
మోదీ క్యాబినెట్ లోకి ఈటల?
బీజేపీకి కీలకమైన మరో రాష్ట్రం తెలంగాణ. అందుకే ఈసారి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో తెలంగాణ కోటా పెరగొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రివర్గంలో ఉన్నారు. వీరితో పాటు మరొకరికి కానీ, ఇద్దరికి కానీ కొత్తగా అవకాశం దొరుకుతుందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈయన తెలంగాణలో బలమైన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బీసీ నేత. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈయనకు మోదీ క్యాబినెట్‌లో మంత్రి హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
మంత్రి పదవి రేసులో డీకే అరుణ, అరవింద్?
మహిళా కోటా కింద డీకే అరుణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉన్న సీనియర్ మహిళా నేత కావడం ఈమెకు కలిసొచ్చే అంశం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పార్టీ పట్టును పెంచేందుకు ధర్మపురి అరవింద్‌కు కూడా అవకాశం ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నా ప్రముఖంగా ప్రచారంలో ఉన్న పేర్లయితే ఇవే.
ధర్మేంద్ర ప్రధాన్ కు పదవీ గండం?
ఇక పునర్‌వ్యవస్థీకరణ అన్నప్పుడు కొందరి పదవులు పోయే అవకాశం కూడా ఉంటుంది. పనితీరు ఆధారంగా, వయోభారం దృష్ట్యా దాదాపు 30-40% మంది మంత్రులను తప్పించే అవకాశముంది. వారికి పార్టీ బాధ్యతలు లేదా గవర్నర్ పదవులు అప్పగించే వ్యూహంలో అధిష్ఠానం ఉన్నట్లు టాక్. నీట్ నిర్వహణలో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్‌కు పదవీ గండం ఉందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన రాజీనామా చేయాలంటూ కొద్ది నెలలుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ధర్మేంద్ర ప్రధాన్‌పై అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోయినా.. కాంపిటీటివ్ పరీక్షల నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ విఫలమైందని విమర్శలు వచ్చాయి. భవిష్యత్‌లో పార్టీ ఎదుగుదలకు ఇది ఆటంకంగా మారుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఆయన పదవి పోవడం ఖాయమనేది కొందరి వాదన. ఐతే కేబినెట్‌లోకి కొత్తగా ఎవరొస్తారు..? ఎవరు రాజీనామా చేస్తారనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఏ క్షణమైనా కేంద్ర మంత్రివర్గ కొత్త లిస్ట్ రావచ్చు.












