తెలంగాణకు అత్యంత కీలకమైన వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. ఈ రెండు ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆయన్ని కలిసి.. ఈ మేరకు చర్చలు జరిపారు. ఇందుకు రామ్మోహన్‌నాయుడు సుముఖత వ్యక్తం చేశారు. ఈ రెండు ఎయిర్‌పోర్టులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌తో పాటు వరంగల్ ఎయిర్‌పోర్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతం మరో ఇండస్ట్రియల్ హబ్‌గా అవతరించనుంది. ఇప్పటికే ట్రై సిటీస్‌గా ఈ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అందులో ఎయిర్‌పోర్ట్ గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది.
ఇప్పటికే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎనుమాములలో ఆసియాలోనే రెండవ అతిపెద్దదైన వ్యవసాయ మార్కెట్ ఉన్నాయి. కాజీపేటలో రూ. 521 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యపురంలో 160 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారంలో రాబోయే ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైల్ సెట్లతో పాటు, దేశానికి అవసరమైన నూతన తరం కోచ్‌లు, వాగన్లు, మెట్రో రైళ్లు తయారుచేయనున్నారు. వీటికి ఎయిర్‌పోర్ట్ కూడా తోడైతే వరంగల్ తలరాత మారిపోతుంది.
ఉత్తర తెలంగాణ నుంచి ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు వరంగల్ నగరమే సెంటర్ పాయింట్. ఈ క్రమంలో ఇది మరో ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారుతుంది. ఈ ప్రాంతాల ప్రజలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాలంటే.. విమానం కోసం హైదారబాద్ దాకా రావల్సిన అవసరముండదు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని నగరాలకు డొమెస్టిక్ సర్వీసులు నడిపించే అవకాశముంది.
ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా ఫార్మా, టెక్స్‌టైల్స్, ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు వరంగల్‌కు తరలివచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ఫలితంగా స్థానికంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. UNESCO గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, మేడారం, లక్నవరం వంటి పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం టూరిస్ట్ హబ్‌గా విరాజిల్లుతుంది. విమానాశ్రయం చుట్టూ వాణిజ్య, నివాస ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది.
ఎయిర్‌పోర్టులో కార్గో హబ్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఉత్పత్తులను సులభంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఉంటుంది. ఇది స్థానికంగా ఉన్న పరిశ్రమలకు, వ్యాపారులకు బాగా కలిసొచ్చే అంశం. ఈ అభివృద్ధి ఒక్క వరంగల్ నగరానికే పరిమితం కాదు. ఎందుకంటే... ఈ ట్రై సిటీస్.. తెలంగాణలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నాయి. అటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, ఇటు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ పూర్తయితే మొత్తం ఉత్తర తెలంగాణ రూపురేఖలే మారిపోవడం ఖాయం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ప్రాంతమే మరో మెగా సెంటర్‌గా రూపు దిద్దుకుంటుంది. ఇప్పటికే ఉన్న కాజీపేట్ రైల్వే జంక్షన్, త్వరలో రానున్న ఎయిర్‌పోర్టుతో వరంగల్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా కూడా రూపాంతరం చెందుతుంది.
మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతుండడంతో వరంగల్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్టికి తమ కలలు సాకరమయ్యే రోజులు వచ్చాయంటూ సంతోషపడుతున్నారు.












