దసరా పండుగ సంబురాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి.ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటున్నారు. అనంతరం పండుగ వేడుకల్లో నిమగ్నం అవుతారు. విజయదశమి వేడుకలను రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ప్రజలు విభిన్నంగా జరుపుకుంటుంటారు. అయితే, దసరా అనగానే అందరికీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం గుర్తుకువస్తుంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఈ ఆనవాయితీని పాటిస్తారు.
ఈసారి కూడా రావణాసురుడి బొమ్మను దహనం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిఏటా రావణాసురుడి బొమ్మను దహనం చేయడం అందరికీ తెలిసిందే. కానీ,ఈసారి ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా వరుసగా నిరసనలు చేపడుతున్న కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) సింబల్ అయిన బొద్దింకను కూడా దహనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ మైదానంలో ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక (కాక్రోచ్) దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.
బొద్దింక దహనమే స్పెషల్..
రావణాసురుడి బొమ్మతో పాటే బొద్దింక బొమ్మను కూడా ఇవాళ సాయంత్రం దహనం చేయనున్నారు.వాటితో పాటే కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను కూడా దహనం చేయనున్నట్టు శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ప్రకటించింది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి బొద్దింక బొమ్మను దహనం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘బొద్దింక’ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయని ఒక డిజటల్ పార్టీ గుర్తు.. కేంద్ర ప్రభుత్వానికి కూల్చేందుకు సీజేపీ కుట్రలు చేస్తోందని పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
ఆ పార్టీకి మద్దతు తెలిపే వారిలో కాంగ్రెస్, విపక్షాలు ఉండగా.. బీజేపీకి మద్దతు తెలిపే వారు సీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దేశరాజధాని ఢిల్లీలో అశాంతిని సృష్టించి కేంద్రంలోని మోడీ సర్కారును దించేందుకు కాంగ్రెస్, సీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ సంయుక్తంగా కుట్రలు పన్నుతున్నాయని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మురికి, అపరిశుభ్రత అంతం కోసం..
అయితే,దేశంలో ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తున్న తరుణంలో బొద్దింక దిష్టిబొమ్మ దహనం చేయాలనే నిర్ణయం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సమాజం, పరిసరాల్లో పేరుకుపోయిన మురికిని, అపరిశుభ్రతను అంతం చేయాలనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే వినూత్నంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేయాలని నిర్ణయించినట్లు శ్రీ కేశవ్ రామ్ లీలా కమిటీ ఇప్పటికే ప్రకటించింది. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు కాక్రోచ్ బొమ్మను ఏర్పాటు చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాగా, బొద్దింక దిష్టి బొమ్మ దహనంపై సీజేపీ ప్రతినిధులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.


