రాజకీయాల్లో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో, సంక్షోభాల నుంచి పార్టీని గట్టెక్కించడంలో,రాజకీయ వ్యూహాలు రచించడంలో, ఆయనను మించిన వ్యూహకర్త లేరనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం బాబు కొన్ని ఎత్తులు వేయక తప్పని పరిస్థితి ముందు ముందు నెలకొనే అవకాశం ఉంటుందని అంటున్నారు..
సాధారణంగా తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం రాజకీయ నాయకుడికి ఒక ఎత్తు. అదే సమయంలో మిత్రపక్షాల ఎదుగుదలను నియంత్రిస్తూ, తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు రక్షణ కల్పించుకోవడం మరో ఎత్తు.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ లైన్ తప్పక ఫాలో అవుతాడాని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కూడా ఇదే విషయాన్ని చూపెడుతుందని అంటున్నారు.
మరోవైపు గత రాజకీయ పరిణామాలు, ప్రస్తుత కూటమి సమీకరణాలు, భవిష్యత్తులో ఎదురయ్యే నాయకత్వ పోటీని కలిపి చూస్తే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు తెరపైకి వస్తాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు, టీడీపీ వారసత్వ రాజకీయాలు, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు పాత్ర.. ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి..
ఇక చంద్రబాబు రాజకీయ చాణక్యం జనసేనకు బలమవడం పక్కనబెడితే.. భవిష్యత్తులో పవన్ కల్యాణ్‌కు సవాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం, టీడీపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టడం ఆయన ప్రధాన లక్ష్యాలు..
అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును కష్టకాలంలో వాడుకుని అధికారంలోకి వచ్చినప్పటికీ, భవిష్యత్తులో పవన్ ఎదుగుదల తన పార్టీకి లేదా కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా పరిణమిస్తే చంద్రబాబు మౌనంగా ఉండరనేది విశ్లేషకుల అంచనా.. అందుకే ఆయన వ్యూహంలో భాగంగా కీలక పదవులు తనకు పూర్తిగా విధేయులుగా ఉండేవారికి కట్టబెట్టడం చంద్రబాబు శైలిగా పేర్కొంటున్నారు.. అలా పవన్ కళ్యాణ్ కు వస్తున్న ప్రజాదరణను కట్టడి చేయడానికి, రాబోయే రోజుల్లో జనసేనను తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడానికి బాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు..
దీనికి కారణంగా 1995లో తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు గుర్తు చేస్తున్నారు.. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన మలుపు ఈ సంవత్సరం.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అధికారంలో ఉండగానే, ఆయనకు వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలను సమీకరించి, పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు చేపట్టడం సాధారణ విషయం కాదని అంటున్నారు..
నాడు ఈ చర్యను ఎన్టీఆర్ వర్గం వెన్నుపోటుగా అభివర్ణించగా.. చంద్రబాబు వర్గం మాత్రం పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటానికి తప్పనిసరిగా నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని వాదించింది. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది.. పార్టీలో సంఖ్యాబలం ఎక్కడ ఉందో గుర్తించి, ఆ బలాన్ని అధికారంగా మార్చుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించడంలో ఆరితేరాడని..
ఈ పరిస్థితుల అనంతరం తన రాజకీయ ప్రస్థానంలో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురిచేసినట్టు చెబుతారు.. ఇక తాను తన పార్టీ బలపడి తనపైన ఉన్న నెగెటివ్ టాక్ పోగొట్టుకోవడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు టీడీపీకి మళ్ళీ జీవం పోశాయి. ఆ వ్యూహాలలో భాగంగా చంద్రబాబు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడం, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీకి ప్రాధాన్యం తీసుకురావడం, పరిస్థితులకు అనుగుణంగా పొత్తులను నిర్మించడం వంటి చర్యలు చేపట్టారు.. ఆయన రాజకీయాలను కేవలం ప్రత్యర్థిని ఓడించడానికి మాత్రమే పరిమితం చేయలేదు..
తన పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా వ్యవహరించారు.. ఇందులో భాగంగా మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం, అధికారంలో వాటి వాటా, నాయకత్వ ఆధిపత్యం వంటి అంశాల్లో తన పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని నిరూపించుకున్నాడు.. ఎందుకంటే తన కుమారుడు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నారు కాబట్టి.. అందుకే ఇక్కడ పవన్ కల్యాణ్ అంశం తెరపైకి వస్తుంది..
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అందులో జనసేనకు ఒక్క స్థానం మాత్రమే దక్కింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీవ్ర రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన మధ్య రాజకీయ సమన్వయం పెరగడం, చివరకు బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేయడం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.
మరోవైపు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఆయనకు మద్దతు ప్రకటించడం, టీడీపీతో పొత్తు దిశగా ముందడుగు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక 2024 లో జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి..
ఇక జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విజయంతో జనసేనకు సొంతంగా బలమైన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం కూడా ఏర్పడింది. అయితే కూటమి అధికారంలో ఉన్నంతకాలం టీడీపీ, జనసేన మధ్య సమన్వయం ఉండటం సహజం. అయితే, భవిష్యత్తులో నాయకత్వం, సీట్ల పంపకం, రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలపై అభిప్రాయభేదాలు వస్తే పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ..
ఎంతైన సొంత ఇంటిలో ఉన్నంత స్వేచ్ఛ కిరాయి ఇంట్లో ఉండదు.. కాబట్టి పవన్ కల్యాణ్ తన పార్టీని మరింత విస్తరించాలనుకుంటే, జనసేనకు మరిన్ని స్థానాలు కావాలి.. అయితే ఈ అంశంలో టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు జవాబులేని ప్రశ్నలా మారింది. కానీ కూటమి రాజకీయాల్లో ఇలాంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు..
ఇక రాజకీయంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు అధికారాన్ని సాధించడం మాత్రమే కాదు, పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించడం కూడా ముఖ్యమే. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు తన పార్టీ భవిష్యత్తు, వ్యక్తిగత రాజకీయ ప్రతిష్ఠ అత్యంత కీలకం.. కాబట్టి భవిష్యత్తులో వీరు పొత్తుతో ముందుకు వెల్లుతారనే నమ్మకం మీద గ్యారంటీ లేదని అంటున్నారు.. ఎందుకంటే ఇక్కడ నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇప్పటికే లోకేశ్ తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువగళం పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ పరిధిని విస్తరించుకున్నాడు.. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ నాయకత్వంలో ఆయన పాత్ర మరింత పెరగడం సహజం.. అలాంటి సమయంలో కూటమిలో మరో బలమైన నాయకుడిగా పవన్ కల్యాణ్ ఎదగడం టీడీపీ నాయకత్వానికి సవాల్ గా మారవచ్చు.. అదీగాక జనసేన సొంత రాజకీయ బలాన్ని పెంచుకుని, టీడీపీతో సమాన స్థాయి భాగస్వామ్యాన్ని కోరితే పరిస్థితులు కూడా మారవచ్చు..
ఇదే జరిగితే చంద్రబాబు రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ను బరిలోకి దింపే అవకాశాలున్నట్టు విశ్లేషిస్తున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ శైలిని పుణికి పుచ్చుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.. అలాగే అచ్చం తాత పోలికలు ఉండటం రాజకీయంగా కలిసి వచ్చే అవకాశంగా ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది..
అదీగాక జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.. అదీగాక తాతను విపరీతంగా అభిమానించే ఈ జూనియర్.. టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందని భావిస్తే తప్పక పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమనే టాక్ పొలిటికల్ సర్కిల్లో ఉంది. అందులో ఇప్పుడు ఆ పార్టీకి ఎన్టీఆర్ తప్ప వేరే ఎవరు కనుచూపు మేర కనిపించడం లేదనే భావన ఏపీ రాజకీయాల్లో ఉంది.
ఇక తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు గురించి భవిష్యత్తులో చర్చ మొదలైతే, ఎన్టీఆర్ కుటుంబ వారసత్వం మరోసారి రాజకీయ ప్రాధాన్యం పొందవచ్చు.. అలాగే భవిష్యత్తులో పవన్ కల్యాణ్, టీడీపీ మధ్య రాజకీయ దూరం పెరిగి.. జనసేన స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే.. ఆ పరిస్థితుల్లో టీడీపీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అమలు చేసే వ్యూహాల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చర్చకు రావచ్చని, యువ ఓటర్లను ఆకర్షించడానికి, పార్టీ భవిష్యత్తును బలోపేతం చేయడానికి ఈ మార్గం తప్ప వేరే మార్గాలు ఫలించే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విశ్లేషణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితే ఏమవుతుందనే ప్రశ్నలు పుట్టడం సహజం.. ఇక 2024లో జనసేన సాధించిన 21 స్థానాలు, అన్ని స్థానాల్లోనూ సాధించిన విజయాలు ఆ పార్టీ బలాన్ని చూపిస్తున్నాయి. అయితే ఆసమయంలో జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. టీడీపీ, బీజేపీతో కూటమి, ఓట్ల బదిలీ, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలు ఈ ఫలితాలను ప్రభావితం చేశాయని చెబుతున్నారు..
అయితే పవన్ కల్యాణ్‌కు ఉన్న వ్యక్తిగత ప్రజాదరణ కూడా కొంతమేర ఓట్లుగా మారాయి.. ముఖ్యంగా యువత, మార్పును కోరుకునే ఓటర్లు, జనసేనకు ప్రత్యేకంగా మద్దతు ఇచ్చే వర్గాలు ఆయనకు అండగా నిలిచారు.. ఇక ముందు కూడా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఒకవేళ జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ఎదురయ్యే అతిపెద్ద సవాల్.. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం, బలమైన స్థానిక నాయకత్వాన్ని నిర్మించడం, ఎన్నికల నిర్వహణకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం..
అదీగాక జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే గతంలో ఒకే కూటమికి మద్దతు ఇచ్చిన ఓటర్లు విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాభపడే అవకాశాలు ఉన్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.. అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీకి నాయకత్వం వహిస్తే, పవన్ కల్యాణ్‌తో ఆయనకు రాజకీయంగా పోటీ ఉండే అవకాశాలను కూడా తప్పుగా అంచనా వేయలేమని అంటున్నారు..
మొత్తానికి చంద్రబాబు రాజకీయ చాణక్యం, పవన్ కల్యాణ్ ప్రజాదరణ, లోకేశ్ రాజకీయ వారసత్వం, జూనియర్ ఎన్టీఆర్ ప్రజాకర్షణ.. ఈ నాలుగు అంశాల చుట్టూ భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక చంద్రబాబు తన పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనుకోవడం రాజకీయంగా సహజమే.
పవన్ కల్యాణ్ తన పార్టీని స్వతంత్ర శక్తిగా ఎదిగించాలని కోరుకోవడమూ సహజమే. అయితే వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తనంత వరకు కూటమి బలంగా ఉంటుంది. కానీ వీరి మధ్య ఏ మాత్రం తేడా వచ్చినా ఏపీ రాజకీయాలు మరో కొత్త కోణానికి దారితీసే అవకాశాలున్నట్టు చెబుతున్నారు..


