నేపాల్ వరదలతో భారత్‌లో డేంజర్ బెల్స్
హిమాలయ రాష్ట్రాలకూ ప్రమాదం..!
హిమనీ సరస్సులు ఉప్పొంగితే.. ప్రళయమే
హిమాలయాల్లో ఓ మంచు కొండ కుప్పకూలింది.. కొండచరియలు విరిగిపడ్డాయి.. ఒక్కసారిగా నీటి ప్రవాహం దూసుకొచ్చింది! క్షణాల్లోనే నది ఉప్పొంగిపోయింది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వందల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఇది సాధారణ వరద కాదు. హిమాలయాల్లో దాగి ఉన్న మరో ప్రమాదానికి ఇది హెచ్చరిక.
నేపాల్‌లోని భోటే కోషి నది వరద బీభత్సం ఇప్పుడు ప్రపంచం దృష్టిని హిమాలయాల వైపు తిప్పింది. తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమని భావించారు. ఆ సమయంలో 4.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని అమెరికాకు చెందిన USGS ప్రాథమికంగా నిర్ధారించింది. కానీ తరువాత మరింత లోతైన విశ్లేషణ, సీస్మిక్ డేటా, శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన USGS.. అది సాధారణ భూకంపం కాదని స్పష్టం చేసింది. హిమనీ ప్రాంతంలో భారీ మంచు–రాళ్ల చరియ కూలిపోవడం వల్లే ఆ ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. దీని కారణంగానే లిండే ఖోలా నదిలోకి భారీగా మంచు, రాళ్లు, నీరు దూసుకెళ్లి.. అక్కడి నుంచి భోటే కోషి నదిని ఉగ్రరూపంలోకి నెట్టినట్లు వెల్లడైంది.
హిమనీ సరస్సు అంటే ఏంటి? అది అంత ప్రమాదకరమా?
హిమాలయాల్లో భారీ హిమనీదాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో కొన్ని హిమనీదాలు క్రమంగా కరుగుతుంటాయి. ఆ కరిగిన నీరు హిమనీదాల ముందు, పక్కన లేదా కింద భాగంలో పేరుకుపోయి పెద్ద సరస్సులుగా మారుతుంది. వీటినే హిమనీ సరస్సులు లేదా Glacial Lakes అంటారు.
ఈ సరస్సులకు సహజంగా మంచు, రాళ్లు, మట్టి కలిసిన ఒక అడ్డుకట్ట ఉంటుంది. దానినే మొరైన్ డ్యామ్ అంటారు. ఇప్పుడు ఊహించండి.. ఒక భారీ కొండచరియ ఆ సరస్సులో పడిందనుకోండి. లేదా మంచు చరియ ఒక్కసారిగా కూలిందనుకోండి. భారీ వర్షాలు కురిసినా, భూకంపం వచ్చినా ఆ సహజ అడ్డుకట్ట బలహీనపడొచ్చు. ఒక్కసారిగా అది తెగిపోతే.. సరస్సులో నిల్వ ఉన్న నీరు మొత్తం దిగువకు దూసుకొస్తుంది. అదే గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్..- GLOF.
ఇది సాధారణ వరదకు పూర్తిగా భిన్నం. నీటితో పాటు మంచు, బండరాళ్లు, మట్టి, చెట్ల కొమ్మలు, కొండచరియల శిథిలాలు కూడా కలిసి అత్యంత వేగంతో కిందికి వస్తాయి. అందుకే మార్గంలో ఉన్న గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు క్షణాల్లో ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమనీదాలు కరిగిపోవడం కారణంగా GLOF ముప్పు మరింత పెరుగుతోందని శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
నేపాల్‌లో ఇప్పుడు జరిగింది కూడా ఈ విస్తృత హిమనీ ప్రమాదాలనే మరోసారి గుర్తుచేసింది. భోటే కోషి పరివాహక ప్రాంతంలో వరద ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. తాజా నివేదికల ప్రకారం నేపాల్‌లో మృతుల సంఖ్య 157కు చేరగా, వందల మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీయులు, భారతీయులు కూడా ఉన్నారు.
భారత్‌కు డేంజర్ బెల్స్...
అవును.. భారత్‌లోని హిమాలయ రాష్ట్రాలు కూడా GLOF ముప్పు ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వందలాది హిమనీ సరస్సులు ఉన్నాయి. వీటిలో కొన్ని వేగంగా విస్తరిస్తున్న సరస్సులుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
2023లో సిక్కింలోని సౌత్ లోనాక్ గ్లేషియల్ లేక్ బద్ధలై వచ్చిన వరద ఎంతటి విధ్వంసం సృష్టించిందో దేశం చూసింది. భారీ నీటి ప్రవాహం తీస్తా నది పరివాహక ప్రాంతంలోకి దూసుకెళ్లి ప్రాణాలు, మౌలిక వసతులు, విద్యుత్ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటన తర్వాత హిమాలయాల్లో GLOF ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆందోళన మరింత పెరిగింది.
అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 2025లో అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో GLOF ప్రమాదాన్ని తగ్గించేందుకు రూ.150 కోట్లతో ఓ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రమాదకర సరస్సులను గుర్తించడం, పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ చర్యల్లో భాగం.
అత్యంత వేగంగా మార్పులు...
అసలు సవాల్ ఇదే.. హిమాలయాల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు చిన్నగా కనిపిస్తున్న హిమనీ సరస్సు.. రేపు భారీ నీటి నిల్వగా మారవచ్చు. ఒక మంచు చరియ, ఒక కొండచరియ, ఒక భూకంపం లేదా భారీ వర్షం.. ఈ నాలుగింటిలో ఏదో ఒకటి ఆ సహజ అడ్డుకట్టను బలహీనపరిస్తే.. దిగువన ఉన్న జనావాసాలకు స్పందించే సమయం చాలా తక్కువగా ఉండొచ్చు.
నేపాల్‌లో జరిగిన విపత్తు అందుకే కేవలం నేపాల్ విషాదం కాదు. హిమాలయాల దిగువన నివసిస్తున్న భారత్‌కు కూడా ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. హిమాలయాలను కేవలం మంచు పర్వతాలుగా చూడటం సరిపోదు. అక్కడ మారుతున్న ప్రతి హిమనీదం, పెరుగుతున్న ప్రతి సరస్సు, బలహీనమవుతున్న ప్రతి కొండ.. దిగువన ఉన్న కోట్లాది ప్రజల భద్రతతో ముడిపడి ఉంది.
నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం.. భారత్‌కు ముందస్తు హెచ్చరికగా మారాలి. హిమనీ సరస్సులపై నిఘా పెంచాలి.. ప్రమాదకర సరస్సులను గుర్తించాలి.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే హిమాలయాల్లో విపత్తు మొదలైన తర్వాత స్పందించడం కంటే.. అది మొదలయ్యే ముందే గుర్తించడం మాత్రమే ప్రాణాలను కాపాడగలదు.












