తెలంగాణ

మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చారిత్రాత్మక మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. చెరువు పరిసరాల్లో జరుగుతున్న సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.

హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాతబస్తీలోని చారిత్రాత్మక మీరాలం చెరువును గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఆధ్వర్యంలో చెరువు పరిసరాల్లో సాగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల ప్రస్తుత పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీసిన సీఎం.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సడెన్ విజిట్‌తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

నగర ప్రజలకు మెరుగైన పబ్లిక్ స్పేస్‌లు, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే లక్ష్యంతో మీరాలం చెరువును ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ (కేబుల్) బ్రిడ్జి నిర్మాణ పనులు, దాని చుట్టూ చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనులను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రాంతీయ రవాణాతో పాటు పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని, పాతబస్తీ రూపురేఖలే మారిపోతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా చెరువు పరిసర ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలను ఎక్కడా రాజీ పడకుండా పాటించాలని సీఎం స్పష్టం చేశారు. కేటాయించిన నిర్ణీత గడువులోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. చెరువు పరిసరాలను పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌లు, ఆధునిక సదుపాయాలతో సుందరీకరించడానికి భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎయిర్ పోర్ట్ కు సమీపం లో ఉన్నందున మీరాలం చెరువు కు పర్యాటకులను ఆకట్టు కునేలా ఏర్పాట్లు ఉండాలి అధికారులకు రేవంత్ సూచించారు.

చెరువు లో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని, చెరువులో ఉన్న ఐలాండ్ లను అభివృద్ధి చేయాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా మీరాలం చెరువును నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. చెరువులోకి అక్రమ వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచి నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

#RevanthReddy#MirAlamTank#CableBridge#MusiRejuvenation#HyderabadTourism#MRDCL#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి