ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందిపై రోగి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే కాలిన గాయాలతో వచ్చిన ఐదేళ్ల బాలుడికి మొబైల్ టార్చ్‌లైట్ వెలుగుల్లో ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు.బిడ్డిక జీవన్(5)పై ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడ్డాయి. దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే మన్యం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
అదే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్యులు మొబైల్ టార్చ్ లైట్ వెలుగులోనే బాలుడికి వైద్యం అందించినట్టు తెలిసింది. బాధిత బాలుడికి మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచన మేరకు కుటుంబసభ్యులు మరల పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదని.. రోడ్లు, తాగు నీరు, ఆస్పత్రులు ఏర్పాటు చేయించామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతుండగా.. ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అందులో కరెంట్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా? జనరేటర్ సదుపాయం కూడా లేకపోతే ఎలా? అని ప్రజలు నిలదీస్తున్నారు.కాగా, టార్చ్ లైట్ వెలుగుల్లో బాలుడికి చికిత్స అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వాలు మారిన సర్కారీ ఆస్పత్రుల్లో వసతులు మెరుగవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












